- శ్రామిక శక్తిలో స్త్రీల ప్రాతినిధ్యం పెరగాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే దిశగా భారత్ పయనిస్తున్న తరుణంలో దేశ శ్రామిక శక్తిలో మహిళల ప్రాతినిధ్యం మరింత వేగంగా పెరగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అభివృద్ధి ద్వారా భారత్ అభివృద్ధి (నారీ శక్తి సే వికసిత్ భారత్) అన్న అంశంపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ఆమె ప్రసంగించారు. గత 50ఏళ్లలో మహిళలు అనూహ్యమైన రీతిలో పురోగతి సాధించారని చెప్పారు. ఒరిస్సాలో బాగా వెనుకబడిన ప్రాంతంలో సామాన్యమైన కుటుంబంలో జన్మించిన తన ప్రయాణం ఈనాడు రాష్ట్రపతి భవన్‌కు వరకు సాగిందని, భారతీయ సమాజంలో అందరికీ సమాన అవకాశాలు, మహిళలకు సామాజిక న్యాయం వుందనడానికి తన జీవితమే ఒక ఉదాహరణ అని అన్నారు. పిల్లల సంరక్షణ వల్ల మహిళలు తరచుగా సెలవులు తీసుకుంటారని, వారు పనిపై పెద్దగా దృష్టి పెట్టలేరనే భావన మనదేశంతోపాటు ఇతర దేశాల్లోనూ ఉందని, ఇది సరికాదని అన్నారు. పిల్లల పట్ల సమాజానికి బాధ్యత వుందా లేదా అనే ప్రశ్న మనకు మనం వేసుకోవాల్సి వుందన్నారు. కుటుంబంలో మొదటి ఉపాధ్యాయురాలు అంటే తల్లేనని మనందరికీ తెలుసు, పిల్లలను చూసుకోవడానికి ఒక తల్లి సెలవు తీసుకుందంటే ఆమె చేసే ఈ ప్రయత్నం సమాజ అభ్యున్నతికి కూడా అని, తన కృషి ద్వారా తన బిడ్డను ఆదర్శప్రాయమైన పౌరుడిగా ఆ తల్లి తీర్చిదిద్దగలుగుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఒక దేశం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే బాలికలకు మరింత మెరుగైన వాతావరణం వుండాలని, అప్పుడే వారు తమ జీవితాల గురించి నిర్భయంగా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు.