- జనవరి నుంచి అమలు
న్యూఢిల్లీ : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్‌ఒ) ఖాతాదారులు ఇకపై విత్‌డ్రాలను ఎటిఎంల ద్వారా నిర్వహించుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఖాతాదారుల ఈజీ ఆఫ్ లివింగ్ (జీవన సౌలభ్యం)ను మరింత మెరుగుపరచడానికి ఇపిఎఫ్‌ఐ నిధుల ఉపసంహరణ ప్రక్రియను సులభతరం చేయడానికి కృషి చేస్తామన్నారు. దీంతో ఒక హక్కుదారుడు, లబ్ధిదారుడు లేదా బీమా చేయబడిన వ్యక్తి తమ తమ క్లెయిమ్‌లను తక్కువ మానవ ప్రమేయంతో పరిష్కరించుకోగలరు. ఎటిఎంల ద్వారా నిధులను ఉపసంహరించుకోగలరు’ అని తెలిపారు. అదేవిధంగా గిగ్ కార్మికుల సామాజిక భద్రతా ప్రయోజనాలను రక్షించే ప్రణాళికల గురించి వివరిస్తూ ఈ ప్రక్రియ వేగంగా ముందుకు వెళుతుందని చెప్పారు. ‘దీనిపై కసరత్తు పూర్తి చేశాం. రూపొందించిన పథకం తుది దశలో ఉంది’ తెలిపారు. ఇపిఎఫ్‌ఒ ప్రస్తుతం ఏడు కోట్ల మందికి పైగా క్రియాశీల కంట్రిబ్యూటర్లు ఉన్నారు. వీరికి సేవలను విస్తరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ ఇంటర్వ్యూలో దావ్రా వివరించారు. ఇపిఎఫ్‌ఒ వద్ద ప్రస్తుతం రూ. 24.75 లక్షల కోట్ల నిధులు ఉన్నాయి.