20 వేల కోట్లు ఖర్చు చేసినా గంగ మురికిగానే ఎందుకుంది?

May 15,2024 00:26 #Congress, #PM Modi
వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో
  •  మోడీని ప్రశ్నించిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మోడీ దత్తత తీసుకున్న వారణాసి గ్రామాలను ఎందుకు వదిలేశారని, రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినా గంగా నది ఇంకా మురికిగానే ఎందుకుంది? అని కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం ప్రశ్నించింది. వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన మోడీ ఇక్కడ తన ‘వైఫల్యాలు’కు సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ‘రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినా గంగా మురికిగా ఎందుకుంది? ప్రధానమంత్రి మోడీ తాను దత్తత తీసుకున్న వారణాసి గ్రామాలను ఎందుకు వదిలివేశారు? వారణాసిలో మహాత్మా గాంధీ వారసత్వాన్ని నాశనం చేయాలని ప్రధాని మోడీ ఎందుకు సంకల్పించారు?’ అని పోస్టులో ఆయన ప్రశ్నించారు. 2014లో వారణాసికి వచ్చిన సందర్భంలో గంగా జలాలను శుద్ధి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నమామి గంగే ప్రాజెక్టుతో రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా నదిలో కాలుష్యం ఇంకా ఎక్కువయిందని విమర్శించారు. రూ.20 వేల కోట్లలో అవినీతితో ఎంత సొమ్మును స్వాహా చేశారని ప్రశ్నించారు. వారణాసి నగరం వెలుపల ఎనిమిది గ్రామాలను మోడీ దత్తత తీసుకున్నారని, ఈ గ్రామాల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదని పేర్కొన్నారు. ఆచార్య వినోభా భావే ప్రారంభించిన సర్వ సేవా సంఫ్‌ును నాశనం చేసే స్థాయికి ప్రధాని దిగజారారని విమర్శించారు. ‘స్వదేశంలో గాంధేయ సంస్థలను నాశనం చేస్తూ.. విదేశాల్లో గాంధీజిని ప్రశంసించాలనే కపట ధోరణిలో ప్రధాని ఉన్నారు’ అని పేర్కొన్నారు. మోడీ అనుసరించేది గాడ్సే సిద్థాంతమని, గాంధీ సిద్థాంతం కాదని అందరికీ తెలుసునని విమర్శించారు.

➡️