ఓటువేసే అవకాశాన్ని కోల్పోవద్దు : జస్టీస్‌ చంద్రచూడ్‌

Apr 21,2024 08:35 #CJI Justice Chandrachud, #speech

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని, ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ‘మై ఓట్‌ మై వాయిస్‌’ మిషన్‌కు ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత పౌరులమని, రాజ్యాంగం పౌరులైన మనకు అనేక హక్కులు కల్పించిందని అన్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన విధుల్లో ఒకటి ఓటు వేయడమన్నారు. గొప్ప మాతృభూమి పౌరులుగా బాధ్యతాయుతంగా ఓటు వేసే అవకాశాన్ని వదులుకోవద్దని అందరినీ అభ్యర్థిస్తున్నానన్నారు. ప్రతి ఐదేళ్లకూ ఐదు నిమిషాలు కేటాయించవచ్చని, గర్వంగా ఓటు వేయాలని సిజెఐ పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పౌరులకు పాత్ర ఉందని, అందుకే రాజ్యాంగంలో ‘భారత ప్రభుత్వం ప్రజలచే.. ప్రజల కొరకు’ అని రాసుందన్నారు. ఈ సందర్భంగా సిజెఐ ఆయన తొలిసారిగా ఓటరుగా ఓటు వేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. పోలింగ్‌ బూత్‌ వద్ద క్యూలో నిలబడి ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిందన్నారు. న్యాయవాదిగా పనిచేస్తున్న సమయంలో ఓటు వేయడంలో విఫలం కాలేదన్నారు.
క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో మార్పులకు దేశం సిద్ధం
క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థలో గణనీయమైన మార్పులకు దేశం సిద్ధంగా ఉందని సిజెఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ అన్నారు. ‘క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో భారతదేశ ప్రగతిశీల మార్గం’ అనే అంశంపై కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన నిర్వహించిన సదస్సులో సిజెఐ ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు భారతదేశం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కొత్త యుగంగా మార్చాయన్నారు. బాధితుల ప్రయోజనాలను కాపాడేందుకు, నేరాలపై విచారణ జరిపేందుకు ఈ మార్పు చేయడం చాలా ముఖ్యమని అన్నారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త చట్టపరమైన చర్యలు అవసరమని సిజెఐ అన్నారు. కొత్త క్రిమినల్‌ చట్టాలతో తీసుకొచ్చిన మార్పుల నుంచి దేశం పూర్తిగా ప్రయోజనం పొందేలా అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫోరెన్సిక్‌ నిపుణులు, పరిశోధకులకు శిక్షణ ఇవ్వడంతోపాటు కోర్టు వ్యవస్థపై పెట్టుబడులు పెట్టాలన్నారు. సదస్సులో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️