- దళితులు, మైనార్టీలపై కొనసాగుతున్న దాడులు
- రాజ్యసభలో సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ విమర్శ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో న్యాయవ్యవస్థ నుండి ఎన్నికల సంఘం వరకు ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉందని సిపిఎం రాజ్యసభ ఉపనేత జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. దళితులు, మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగుతోందని అన్నారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో సిపిఎం రాజ్యసభ ఉపనేత జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ దేశంలో దళిత, మైనారిటీ వర్గాలు సంఫ్‌ు పరివార్ పాలనలో భయంతో జీవిస్తున్నాయని అన్నారు. ‘ప్రభుత్వం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని చెబుతోంది. ఈ పాలసీ బాధితురాలైన మహిళ జాకియా జాఫ్రీ నిన్న మరణించారు. ఆమె న్యాయం కోసం తిరిగారు. తనవారి కోసం మాత్రమే కాదు, గుజరాత్ మారణహోమంలో ఊచకోత కోయబడిన వారందరికీ న్యాయం కోసం ఆమె తిరిగారు. ఆమె భర్త ఎహ్సాన్ జాఫ్రీ అప్పటి లోక్‌సభ సభ్యుడు. ఆయన్ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇది మైనారిటీలు ఎదుర్కొంటున్న భయానక వాతావరణం’ అని పేర్కొన్నారు.
‘ఉత్తరప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? వివిధ ప్రాంతాలు తవ్వకాలకు, పరీక్షలకు సిద్ధమవుతోన్నాయి. అజ్మీర్ దర్గా కూడా అదే ముప్పును ఎదుర్కొంటోంది. వాజ్‌పేయి, మోడీ ఇద్దరూ అక్కడ విస్తరించడానికి ‘చాదర్‌లను’ అందించారు. ఆ దర్గాను కూడా కూల్చివేసేందుకు డిమాండ్ చేస్తున్నారు. ఇదీ మైనారిటీల పరిస్థితి. ప్రతి క్రిస్మస్ నాడు, బిషప్‌లు, పాస్టర్లకు మోడీ విందు ఏర్పాటు చేస్తారు. అది గౌరవం కోసం కాదు. వారి ఓట్లు రావన్న భయంతో మాత్రమే. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై 834 దాడులు జరిగాయి. యుపిలోని బరేలీలో ఇంట్లో బైబిల్ ఉంచుకున్నందుకు ఇద్దరికి జైలు శిక్ష విధించారు. దళితులు కూడా వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఒక వివాహానికి గుర్రంపై వచ్చిన ఒక దళిత వ్యక్తిని ఈడ్చుకెళ్లి కొట్టారు’ అని పేర్కొన్నారు.
‘కేరళ దేశంలో భాగమని కేంద్ర ప్రభుత్వం భావించడం లేదు. వయనాడ్ విపత్తు సమయంలో కూడా ఎటువంటి సహాయం అందించలేదు. కేరళను వెనుకబడిన రాష్ట్రంగా ప్రకటిస్తే సహాయం అందిస్తామని ఒక కేంద్ర మంత్రి అన్నారు’ అని పేర్కొన్నారు. ‘శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలని రాజ్యాంగం పేర్కొంది. ఇక్కడ ఒక ఐఐటి డైరెక్టర్ గోమూత్రం తాగాలని పిలుపునిస్తున్నారు. న్యాయవ్యవస్థ నుండి ఎన్నికల కమిషన్ వరకు ప్రతిదానినీ ప్రభుత్వం నియంత్రిస్తోంది. ఒక హైకోర్టు న్యాయమూర్తి ముస్లిములను బహిరంగంగా అవమానించారు. ఇది హజ్రత్ మొహాని, భగత్ సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల భూమి. వారు ప్రజలకు ప్రేరణ. వారు ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాన్నిచ్చారు. స్వాతంత్య్రం పోరాటంలోని అలాంటి మంచి విషయాలను తిరిగి పొందాలి’ అని బ్రిట్టాస్ తెలిపారు.