తులసి గబ్బార్డ్ వ్యాఖ్యలపై స్పందించిన ఇసి
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాక్ చేయడానికి అనువుగా వుంటాయని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్డార్డ్ చేసిన వ్యాఖ్యలపై భారత ఎన్నికల కమిషన్ శుక్రవారం స్పందించింది. సులభంగా, సక్రమంగా, కచ్చితమైన కాలిక్యులేటర్ల మాదిరిగా పనిచేసే ఇవిఎంలను భారత్ ఉపయోగిస్తోందని, వాటిని ఇంటర్‌నెట్‌కు, వైఫైకు లేదా ఇన్‌ఫ్రారెడ్‌కు అనుసంధానించలేమని స్పష్టం చేసింది. కొన్ని దేశాలు ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థలు అనేక వ్యవస్థల మిళితంగా వుంటాయని ఇసి వర్గాలు తెలిపాయి. ఇంటర్‌నెట్ వంటి వివిధ ప్రైవేటు నెట్‌వర్క్‌లతో సహా పలు యంత్రాలు, ప్రాసెస్‌ల సమాహారంగా అవి వుంటాయన్నారు. భారత్‌లో ఈ ఇవిఎంలు సుప్రీంకోర్టు నిర్వహించిన న్యాయబద్ధమైన పరిశీలనకు నిలబడ్డాయన్నారు. పోలింగ్ ప్రారంభం కావడానికి ముందుగా నమూనా ఎన్నికల నిర్వహణకు ఉపయోగించడంతోసహా వివిధ దశల్లో రాజకీయ పార్టీలు కూడా వీటిని తనిఖీ చేశాయని ఆ వర్గాలు తెలిపాయి. ఐదు కోట్లకు పైగా కాగితపు బ్యాలెట్లతో పరిశీలించి, పోల్చి నిర్ధారించామని, ఇదంతా కూడా రాజకీయ పార్టీల సమక్షంలోనే జరిగిందని ఇసి వర్గాలు తెలిపాయి.
దీర్ఘకాలంగా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థలు ఎలా హ్యాకింగ్‌కు అనువుగా వున్నాయో తెలియజేసే సాక్ష్యాధారాలు అమెరికా కేబినెట్‌కు దొరికాయని తులసి గబ్బార్డ్ గురువారం తెలిపారు. ఓట్లు వేసినప్పుడు ఫలితాలను మార్చివేసేందుకు వీటితో అవకాశం వుంటుందని అన్నారు. ఈ నిర్ధారణలతోనే దేశవ్యాప్తంగా కాగితపు బ్యాలట్లు ఉపయోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. తద్వారా అమెరికా ఎన్నికల సమగ్రత పట్ల ప్రజలకు నమ్మకం వుంటుందన్నారు. మానవులు లేదా కృత్రిమ మేథ ఈ యంత్రాలను హ్యాక్ చేసేందుకు ముప్పు పొంచి వుందంటూ గతేడాది ఎలన్ మస్క్ హెచ్చరిస్తూ, ఇవిఎంలను తొలగించాలని కోరారు.
