సిబిఎస్‌ఇ ఆదేశాలు – ఉర్దూ మీడియం స్కూళ్ల ఆందోళన
న్యూఢిల్లీ : బోర్డు పరీక్షలను హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే రాయాలంటూ సీబీఎస్‌ఈ జారీ చేసిన ఆదేశాలు ఉర్దూ మీడియం స్కూల్స్‌కు తలనొప్పిగా మారాయి. హిందీ, ఇంగ్లీషులో కాకుండా ఇతర భాషలలో బోర్డు పరీక్షలు రాయటానికి అనుమతించకూడదని సీబీఎస్‌ఈ తీసుకున్న నిర్ణయంపై మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లోని మూడు ఉర్దూ మీడియం పాఠశాలలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్, నుV్‌ాఎ (హర్యానా), దర్బంగా (బీహార్)లోని మనూ ‘మోడల్ స్కూల్స్’ ఉర్దూలో విద్యను అందిస్తున్నాయి. భాషా పరంగా ఏ మాధ్యమాన్నీ అధికారికంగా గుర్తించని ఈ పాఠశాలలు సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్నాయి. బోర్డు అనుమతి లేకుండా హిందీ, ఇంగ్లీష్‌లలో కాకుండా ఇతర భాషల్లో జవాబు పత్రాలు రాసి ఉంటే వాటిని మూల్యాంకనం చేయరాదని సీబీఎస్‌ఈ పాలక మండలి జూన్‌లో నిర్ణయించింది.
మనూ 2010లో మూడు మోడల్ పాఠశాలలను ప్రారంభించింది. వీటిలో రెండు పాఠశాలల అధికారులు తమ మాధ్యమం ఉర్దూ అన్న పూర్తి అవగాహనతో సీబీఎస్‌ఈ తమకు అనుబంధాన్ని మంజూరు చేసిందని చెప్పారు. మనూ పాఠశాలల విద్యార్థులకు 2020 వరకు ఇంగ్లీష్, హిందీతో పాటు ఉర్దూ భాషలలో ప్రశ్నపత్రాలు లభించేవనీ, 2021 నుంచి బోర్డు ఉర్దూ ప్రశ్నపత్రాలను అందించటం నిలిపివేసిందని చెప్పారు. గత మూడేండ్లుగా, ఈ మూడు స్కూళ్ల విద్యార్థులకు ప్రశ్నపత్రాలను ఆంగ్లం, హిందీలో పంపినప్పటికీ.. ఉర్దూలోనే సమాధానాలు రాయటం కొనసాగించారు. అయితే, సీబీఎస్‌ఈ తాజా నిర్ణయంతో ఈ పాఠశాలల విద్యార్థులు ఇకపై ఉర్దూలో సమాధానాలు రాయటానికి వీలుండదు.