బెంగాల్‌లో మితిమీరుతున్న తృణమూల్‌ ఆగడాలు

Feb 22,2024 10:40 #Brinda Karat, #cpm
  • ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు
  • బృందా కరత్‌ వద్ద సందేశ్‌ఖాలి బాధితుల మొర

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రస్‌ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గూండాలే రాజ్యమేలుతున్నారా అన్నంతగా పరిస్థితులు దిగజారిపోయాయి. సందేశ్‌ఖాలి ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు ఇందుకు తాజా ఉదాహరణ. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ నేతృత్వంలోని బృందం బుధవారం బాధితులను పరామర్శించి భరోసా కల్పించింది. ఈ సందర్భంగా బాధిత ప్రజలు సిపిఎం బృందంతో తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ‘తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలకు వ్యతిరేకంగా పెదవి విప్పితే రాష్ట్ర ప్రభుత్వం మాపై కన్నెర్ర చేస్తోంది. మాకు తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నాయి. మాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. కానీ మేము కోరుకుంటున్నది ఒక్కటే. రౌడీ షీటర్లు అయిన తృణమూల్‌ నేతలు ఎస్‌కే షాజహాన్‌, ఉత్తమ్‌ సర్దార్‌, షిబు హజ్రాలకు బెయిల్‌ రాకూడదు’ అని తపరు సర్దార్‌ అనే మహిళ రోదిస్తూ సిపిఎం బృందానికి తన గోడు వెళ్లబోసుకుంది. ఈ బృందంలో బృందాకరత్‌తో పాటు ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కనికిన ఘోష్‌, రాష్ట్ర అధ్యక్షురాలు జహనారా ఖాన్‌, మాజీ మంత్రి రేఖా గోస్వామి తదితరులున్నారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయంటూ పోలీసులు తొలుత ఐద్వా బృందాన్ని నిలువరించారు. అయితే సందేశ్‌ఖాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిషేధాజ్ఞలు విధించాలన్న నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. ధమ్‌ఖాలీ ఫెర్రీ ఘాట్‌ వద్ద రెండు గంటల పాటు వేచిచూసిన తర్వాత ఐద్వా బృందాన్ని పోలీసులు అనుమతించారు. పర్యటన అనంతరం బృందా కరత్‌ మాట్లాడుతూ బాధిత మహిళలు తాము ఎదుర్కొన్న వేధింపులను వివరించారని చెప్పారు.

తృణమూల్‌ మూకలు తన కుమార్తెను అపహరించారని, ఆరు రోజులైనా ఆమె జాడ తెలియడం లేదని అపర్ణా దాస్‌ తెలిపారు. కాముకులకు మరణశిక్ష విధించాలని తాము కోరుకుంటున్నామని పలువురు మహిళలు ఐద్వా బృందానికి తెలియజేశారు. లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ హయాంలో తమకు భూ పట్టాలు ఇచ్చారని, అయితే ఇప్పుడు తృణమూల్‌ గూండాలు భయోత్పాతాన్ని సృష్టించి తమ భూములను కబ్జా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారని చెప్పారు. వేధింపుల విషయంలో యూపీ పోలీసులకు, బెంగాల్‌ పోలీసులకు తేడా లేదని ఈ సందర్భంగా బృందా కరత్‌ వ్యాఖ్యానించారు. దోషులను వెంటనే అరెస్ట్‌ చేసి, వారిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖానీ ప్రాంతం గత నెల రోజులుగా అట్టుడికిపోతోంది. రాష్ట్రంలో చోటుచేసుకున్న రేషన్‌ కుంభకోణంపై విచారణ జరపడానికి వచ్చిన ఈడీ అధికారులపై తృణమూల్‌ మూకలు దాడి చేసి తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.

కొందరు స్థానిక తృణమూల్‌ నాయకులు కండబలంతో తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆ ప్రాంతానికి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తృణమూల్‌ నాయకుడు షాజహాన్‌ షేక్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఈడీ అధికారులు వెళ్లగా వారిని తీవ్రంగా కొట్టి హింసించారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మహిళలు తృణమూల్‌ నేతల అరాచకంపై గళం విప్పడం ప్రారంభించారు. మరోవైపు వేధింపులకు పాల్పడిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు వారి దుకాణాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. కాగా సందేశ్‌ఖాలి సందర్శించిన రాష్ట్ర గవర్నర్‌ సివి ఆనంద బోస్‌ కూడా బాధితులతో ముచ్చటించారు.

➡️