ప్రజాశక్తి -న్యూఢిల్లీ బ్యూరో : సీతారాం ఏచూరి అంతిమయాత్ర సందర్భంగా సిపిఎం కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్ వద్ద శనివారం ఉదయం నుండి ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఏచూరి మరణవార్త తెలియడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సిపిఎం శ్రేణులు, వామపక్ష అభిమానులు శుక్రవారం రాత్రికే ఎకెజి భవన్ వద్దకు చేరుకున్నారు. శనివారం ఉదయం ఉదయం 10 గంటల ప్రాంతంలో సౌత్ వెస్ట్ ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసం నుంచి అంబులెన్స్‌లోఏచూరి భౌతిక కాయాన్ని ఎకెజి భవన్‌కు తీసుకొచ్చారు. ఏచూరి భార్య సీమా చిస్తీ, కుమార్తె అఖిల, కుమారుడు డానిష్, సోదరుడు శంకర్ తదితరులు భౌతికకాయంతో పాటు వచ్చారు. ఆ సమయంలో ‘సీతారం అమర్‌రహే’ అన్న నినాదాలు మారుమ్రోగాయి. ఎకెజి భవన్ ఆవరణంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన స్థలంలో ప్రజల సందర్శనార్థం ఉంచిన ఏచూరి భౌతిక కాయాన్ని ఉంచారు. తొలుత పొలిట్‌బ్యూరో సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ప్రకాష్ కరత్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మాణిక్ సర్కార్, బృందాకరత్, బివి రాఘవులు, నిలోత్పల్ బసు, ఎంఎ బేబిలు తొలుత నివాళులర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్ర కమిటీల ప్రతినిధులు నివాళులర్పించారు. ఆ తరువాత ప్రియతమ నేతకు నివాళులు అర్పించేందుకు తరలివచ్చిన విద్యార్థులు, కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, గృహిణులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక సంఘాల కార్యకర్తలు, రచయితలు, చరిత్రకారులు ఇలా వివిధ తరగతులకు చెందిన వారు ఒకరి తరువాత ఒకరుగా ప్రియతమ నేతను కడసారి ‘రెడ్ సెల్యూట్’ చెప్పారు.
