‘ఉజ్వల’ లబ్ధిదారులకు రాయితీ పొడిగింపు

Mar 8,2024 10:56 #gas, #ujwala

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఉజ్వల’ లబ్ధిదారులకు వంట గ్యాస్‌ సిలిండర్‌పై ఇస్తున్న రాయితీ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఒక్కో సిలిండర్‌పై ప్రస్తుతం ఇస్తున్న రూ.300 సబ్సిడీని ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికీ కూడా వర్తింపజేయనున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఈ రాయితీ లభిస్తుందన్నారు. ఇందుకోసం రూ.12 వేల కోట్ల వెచ్చించాల్సివుంటుందని మంత్రి తెలిపారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంట గ్యాస్‌తో సహా పెట్రోలు, డీజిల్‌ ధరలనూ పదేపదే పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపిన సంగతి తెలిసిందే. ధరాఘాతంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ మంది లబ్ధిదారులంటే ‘ఉజ్వల’ పథకం సిలిండర్‌కు రాయితీ ధర ప్రకటించి బిజెపి సర్కార్‌ గొప్పలు ప్రచారం చేసుకుంటోంది. కాగా ఉత్తర పూర్వ పరివర్తన పారిశ్రామికీకరణ పథకానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి గోయల్‌ చెప్పారు. ఈ పథకం కింద పదేళ్ల పాటు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్యం ప్రతిపాదనలను ఆమోదించిందన్నారు. మొత్తం రూ.10,037 కోట్లతో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ముడి జూట్‌కు కనీస మద్దతు ధర2024-25 సీజన్‌ కోసం ముడి జూట్‌కు కనీస మద్దతు ధరలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపినట్లు కూడా మంత్రి గోయల్‌ వెల్లడించారు. 2024-25 సీజన్‌లో రా జూట్‌ ఎంఎస్‌పి (టిడిఎన్‌-3 మునుపటి టిడి-5 గ్రేడ్‌కి సమానం) క్వింటాల్‌కు రూ.5,335గా నిర్ణయించిందన్నారు. కమీషన్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ కాస్ట్స్‌ అండ్‌ ప్రైసెస్‌ (సిఎసిపి) సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనివల్ల దాదాపు 1.65 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని అన్నారు.

➡️