లోక్‌సభలో రైతాంగ గళం

Jun 10,2024 00:18 #AIKS, #Sitaram Yechury
  • అమ్రారామ్‌కు కిసాన్‌ సభ అభినందనలు

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని సికార్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ‘ఇండియా’ ఫోరం తరపున సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసి విజయఢంకా మోగించిన వ్యవసాయోద్యమ నాయకులు అమ్రా రామ్‌ను అఖిల భారత కిసాన్‌సభ (ఎఐకెఎస్‌) ఘనంగా సత్కరించింది. ఢిల్లీలోని ఎఐకెఎస్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఈ సత్కార కార్యాక్రమానికి సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌, ఎ విజయరాఘవన్‌, కార్మిక, రైతు సంఘాల నాయకులు తపన్‌ సేన్‌, హన్నన్‌ మొల్లా, విజ్జు కృష్ణన్‌ తదితరులు హాజరయ్యారు. ఎఐకెఎస్‌ మాజీ జాతీయ అధ్యక్షులు కూడా అయిన అమ్రా రామ్‌కు ఏచూరి, బృందా ప్రభృతులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఎఐకెఎస్‌ ప్రధానకార్యదర్శి విజ్జు కృష్ణన్‌ శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో రైతుల పక్షాన పోరాటం సాగించిన అమ్రా రామ్‌ ఇక నుంచి లోక్‌సభలోనూ రైతులు పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన గళాన్ని వినిపిస్తారని తెలిపారు. కిసాన్‌సభ మాజీ ప్రధానకార్యదర్శి హన్నన్‌ మొల్లా మాట్లాడుతూ వ్యవసాయోద్యమానికి ప్రతీకగా నిలిచిన అమ్రారామ్‌ పార్లమెంటులో అడుగుపెట్టడం ద్వారా అక్కడ కూడా అన్నదాతల గళం ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. ఎఐకెస్‌ జాతీయ అధ్యక్షులు అశోక్‌ ధావలే మాట్లాడుతూ రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడంలో అమ్రా రామ్‌ మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌సభ నాయకులు పి కృష్ణ, ఐద్వా ప్రధానకార్యదర్శి మరియం దావలే, జెఎన్‌యు విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షులు ఐసి ఘోష్‌; ఢిల్లీ వర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు రాజీవ్‌ కన్వర్‌, దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) నాయకులు నత్తు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️