అనంతనాగ్ : కాశ్మీర్ ఎప్పుడూ భారతదేశంలో భాగంగానే ఉంటుందని జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. శనివారం పెహల్గామ్‌లో ఆయన పర్యాటకులను కలిశారు. అనంతరం ఫరూక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవలే పెహల్గామ్‌లో దాడి జరిగింది. ఈ దాడి తర్వాత పర్యాటకులు భయపడడం లేదు. ఇదే పెద్ద సందేశం. భయాన్ని వ్యాప్తి చేయాలనుకున్న వారు (ఉగ్రవాదులు) ఓడిపోయారు. మనం భయపడబోమని ఈరోజు నిరూపితమైంది. కాశ్మీర్ ఎప్పుడూ భారతదేశంలో భాగంగానే ఉంటుంది. ప్రజలు ఉగ్రవాదం అంతం కావాలని కోరుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని చూసి 35 సంవత్సరాలైంది. మనం పురోగతిని కోరుకుంటున్నాము. మనం ముందుకు సాగాలనుకుంటున్నాము. మనమే ఒకరోజు సూపర్ పవర్ అవుతాం’ అని ఆయన అన్నారు.
కాగా, ఈ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోడీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో తీవ్రంగా స్పందించారు. ప్రధాని తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ‘సింధు నదిలో మా నాళ్లైనా పారాలి.. లేదా మీ రక్తమైన పారాలి’ వంటి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలపైనా శనివారం ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. అసలు బిలావల్ భుట్లో వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఆయన ప్రకటనలకు అంత ప్రాధాన్యత లేదని ఫరూక్ అన్నారు. బుట్టో వ్యాఖ్యలపై దృష్టి పెడితే.. మన దేశం ముందుకు సాగదని ఆయన అన్నారు.
