న్యూఢిల్లీ : ప్రతిపక్షాన్ని (కాంగ్రెస్ పార్టీ)ని అంతం చేసేందుకు మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని రాజ్యసభ ఎంపి కపిల్‌సిబల్ దుయ్యబట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో స్థిరాస్తుల స్వాధీనం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) నోటీసులు జారీ చేయడాన్ని రాజ్యాంగంపై దాడిగా పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మనం తల్లి వంటి ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నప్పటికీ.. వాస్తవానికి మీరు నియంతృత్వానికి తండ్రిలా వ్యవహరిస్తున్నారని బిజెపిపై మండిపడ్డారు. బిజెపి హిందూ -ముస్లిం ఎజెండాపై విభజన రాజకీయాలు చేస్తోందని, ప్రతిపక్షాలను అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నియంత్రిస్తున్న నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్ అండ్ ది అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకోనున్నట్లు ఈడి శనివారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
