చెన్నై : ఫెంగల్ తుపానుతో తమిళనాడు ఉత్తర కోస్తా తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరిలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.. బకింగ్ హామ్ కెనాల్‌కు వరద నీరు పోటెత్తింది. వదర బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్నిచర్యలు చేపట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆదేశించారు. చెన్నైలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి సహాయక చర్యలపై ఆయన సమీక్షించారు. మరో రెండు మూడు రోజుల పాటు గాలులు, వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. వరద బాధితులను సహాయ పునరావాస కేంద్రాలకు తలరలించి, కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేశారు.
ముమ్మరంగా సహాయక ఏర్పాట్లు
ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదముందని వాతావరణ విభాగం హెచ్చరించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. చెన్నరు విమానాశ్రయంలో విమాన సర్వీసులన్నిటినీ రద్దు చేశారు. విమానాశ్రయాన్ని డిసెంబరు 1వ తేదీ ఉదయం 4 గంటల వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. కారణంగా భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో మొత్తం 2,229 శిబిరాలు ప్రారంభించారు. నాగపట్నం, తిరువారూర్ జిల్లాలకు చెందిన 470 మందికి పైగా ప్రజలను ఆరు సహాయ శిబిరాలకు తరలించారు. సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో అధికారులు జారీ చేసిన సలహా మేరకు 4,100కు పైగా మత్స్యకార పడవలు తిరిగొచ్చాయి. వర్షానికి నేలకూలే చెట్లను తొలగించడానికి హైడ్రాలి, టెలిస్కోపిక్ పరికరాలతో సహా 489 ప్రత్యేక యంత్రాలను సిద్ధం చేశారు. రైల్వే వంతెన పనుల కోసం తాత్కాలికంగా మూసివేయబడిన గణేశపురం మినహా మిగిలిన 22 సబ్‌వేలు పని చేస్తున్నాయి. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ 329 సహాయ కేంద్రాలను సిద్ధం చేసింది. వాటిలో ఆహారం, నీరు మరియు పారిశుద్ధ్య సౌకర్యాలు ఉన్నాయి. 103 బోట్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.