జమ్ముకాశ్మీర్‌లో బస్సుపై ‘ఉగ్ర’ కాల్పులు : తొమ్మిది మంది మృతి

  • అదుపు తప్పి లోయలో పడిన బస్సు 
  • తొమ్మిది మంది మృతి

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం సాయంత్రం రైసీ జిల్లాలో యాత్రీకులతో ప్రయాణం చేస్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించాగా, 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు యాత్రీకులతో శివ్‌ ఖోరి కేవ్‌ మందిరానికి వెళ్తుండగా ఈ దాడికి గురైంది. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడని, దీంతో బస్సు లోయలోకి పడిపోయిందని రైసీ సీనియర్‌ ఎస్‌పి మోహితా శర్మ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రంగంలోకి దిగి యాత్రీకులను రక్షించడానికి ప్రయత్నించారు. తరువాత పోలీసులు, ఆర్మీ, పారామిలటరీ దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సరిహద్దు జిల్లాలు రాజౌరీ, ఫూంచ్‌ జిల్లాతో పోలిస్తే రైసీ జిల్లాలో ఉగ్రవాద కార్యక్రమాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి జిల్లాలో ఉగ్రదాడి జరగడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు తెలిపారు. మృతుల్ని ఇంకా గుర్తించలేదని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి, చికిత్స ఆందిస్తున్నామని రైసీ జిల్లా విశేష్‌ మహజన్‌ తెలిపారు.

➡️