ప్రజా తీర్పే ఫైనల్‌

  • బిజెపి దాడిని తిప్పికొట్టడం… నిజాయితీ నిరూపించుకోవడం
  • ఇదే కేజ్రీవాల్‌ ద్విముఖ వ్యూహం
  • దశాబ్ద కాలంలో రెండోసారి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా

న్యూఢిల్లీ : చెప్పినట్లుగానే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇకపై ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టబోతున్నారు. గతంలో మాదిరిగానే మరోసారి వారి ఆశీస్సులు తనకు లభిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. తన ప్రతిష్టను దెబ్బతీస్తున్న బిజెపి దుష్ట పన్నాగాలను ఎండగట్టి రాబోయే శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీని చిత్తు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. తాను నిజాయితీపరుడినని నమ్మితేనే ఓటు వేసి ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోబెట్టాలని ప్రజలను కోరబోతున్నారు. అయితే ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఇది రెండోసారి. పది సంవత్సరాల క్రితం…2014 ఫిబ్రవరిలో కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు ఆప్‌ ప్రభుత్వం కేవలం 49 రోజులు మాత్రమే అధికారంలో ఉంది. మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన కొద్ది రోజులకే కేజ్రీవాల్‌ ఇప్పుడు మరోసారి పదవిని త్యజించారు. ఢిల్లీ శాసనసభకు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆప్‌ చేతిలో ఇప్పటికే రెండుసార్లు భంగపడిన బీజేపీ, ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఎత్తుగడలు పన్నుతోంది. అందులో భాగంగానే కేజ్రీవాల్‌పై పలు అవినీతి ఆరోపణలు చేసింది. కేజ్రీని అవినీతిపరుడిగా చిత్రీకరించి ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోంది.
‘కేజ్రీవాల్‌కు ఈడీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దర్యాప్తు సంస్థ పక్షపాత పూరితంగా వ్యవహరిస్తోందని అక్షింతలు వేసింది. సుప్రీంకోర్టు కూడా ఆయనకు బెయిల్‌ ఇస్తూ పంజరంలో చిలుకలా వ్యవహరించవద్దని సీబీఐకి చురక వేసింది. కేజ్రీవాల్‌ డబ్బు సంపాదించడానికి రాజకీయాలలోకి రాలేదు. ఆయన గౌరవం పొందారు’ అని ఆప్‌ ప్రధాన జాతీయ సలహాదారు ప్రియాంక కక్కర్‌ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ ఇమేజ్‌ను బీజేపీ దెబ్బతీస్తోందని, అందుకే తిరిగి ఢిల్లీ ప్రజల వద్దకు వెళ్లి తాను నిజాయితీపరుడిని అయితేనే తిరిగి ఎన్నుకోండని కోరతారని తెలిపారు.

ఇక ప్రజాక్షేత్రంలో…
జైలులో ఉన్నప్పుడు కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని బిజెపి పదే పదే డిమాండ్‌ చేసింది. అయినప్పటికీ ఆయన పదవిలో కొనసాగారు. జైలులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఆప్‌ అభిప్రాయపడింది. జైలులో ఉన్నప్పుడేమో రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారని, ఇప్పుడు ఆ పని చేస్తే అదో స్టంట్‌ అంటున్నారని కక్కర్‌ మండిపడ్డారు. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఇదివరకే బెయిల్‌ పొందారు. రాజ్యసభ ఎంపీ సంజరు సింగ్‌కు కూడా బెయిల్‌ వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్‌ కూడా బయటకు రావడంతో ఆప్‌ నేతలంతా ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు
అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన తనకు, ఆప్‌కు కళంకాన్ని ఆపాదించి పార్టీ నేతలను జైలుకు పంపారని కేజ్రీవాల్‌ ప్రజలకు వివరించబోతున్నారు. రాబోయే శాసనసభ ఎన్నికలను ఆయన రిఫరెండంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం వెనుక కేజ్రీవాల్‌ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒక వైపు బీజేపీ దాడిని తిప్పికొట్టడంతో పాటు మరోవైపు ఆ పార్టీ ఆరోపణలతో దెబ్బతిన్న తన ఇమేజ్‌ను పునరుద్ధరించు కోవడమే లక్ష్యంగా కేజ్రీవాల్‌ అడుగులు వేస్తున్నారు.

➡️