అశ్రునయనాలతో అంతిమయాత్ర

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకపు అశ్రునయనాల మధ్య సీతారాం ఏచూరి అంతిమయాత్ర సాగింది. గోల్‌ మార్కెట్‌లోని సిపిఎం కార్యాలయం నుండి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. గురుద్వార్‌, కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం, డాక్‌ భవన్‌, పటేల్‌ చౌక్‌ మెట్రోస్టేషన్‌ మీదుగా జంతర్‌ మంతర్‌ రోడ్డు వరకు సాగింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర సాగిన అంతిమ యాత్రలో ముందు భాగాన రెడ్‌ షర్ట్‌ వలంటీర్లు ఏచూరి చిత్ర పటాలు, సిపిఎం జెండాలు చేబూని నినాదాలు చేస్తూ భాగస్వాములయ్యారు.
వారి తరువాత ఏచూరి భౌతిక కాయంతో అంబులెన్స్‌ కదిలింది. అంబులెన్స్‌ వెనుక సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌, మాణిక్‌ సర్కార్‌, బృందాకరత్‌, బివి రాఘవులు, అశోక్‌ దావలే, .జి రామకృష్ణన్‌, ఎంఎ బేబి, విజయరాఘవన్‌, ఎంవి గోవిందన్‌ మాస్టార్‌ తదితరులు నడిచారు. కేంద్ర కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ప్రతినిధులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, న్యాయవాదులు తదితరులు అంతిమయాత్రలో భాగస్వాములయ్యారు. యాత్ర సాగిన దారిపొడవునా ఉన్న ప్రజలు ఏచూరికి లాల్‌సలాం చెబుతూ నినాదాలు చేశారు. జంతర్‌ మంతర్‌ రోడ్డు నుంచి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్‌ ఎస్కార్ట్‌ నడుమ భౌతిక కాయాన్ని ఎయిమ్స్‌కు తరలించారు. అంతిమ యాత్రలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పి మధు, ఎస్‌ పుణ్యవతి, హేమలత, ఆర్‌ అరుణ్‌ కుమార్‌, వై వెంకటేశ్వరరావు, వి ఉమా మహేశ్వరరావు, వి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, బి వెంకట్‌, ఎస్‌ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, టి సాగర్‌, జాన్‌ వెస్లీ, డిజి నరసింహారావు పాల్గొన్నారు.

ఎయిమ్స్‌లో చివరి చూపులు…
సాయంత్రం 4.40 గంటలకు ఏచూరి కుటుంబ సభ్యులు, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఏచూరి భౌతిక కాయాన్ని ఎయిమ్స్‌ అనాటమీ విభాగానికి అప్పగించారు. ఆస్పత్రి అధికారులు భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఆ మేరకు ధృవీకరణ పత్రాన్ని ఏచూరి కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగానే అనాటమి విభాగంలో 10 నిమిషాల పాటు చివరిసారి ఏచూరిని చూడటానికి కుటుంబసభ్యులకు, అగ్రనేతలకు అవకాశం లభించింది. ఇక్కడే తుది నివాళులర్పించిన అనంతరం వారు ఆ హాలు నుండి బయటకు వచ్చారు. ఆ వెంటనే ఆ విభాగం తలుపులను మూసివేశారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఏచూరి ఏయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ చికిత్స తీసుకుంటూనే ఆయన తుదిశ్వాస విడిచారు. అదే ఆస్పత్రికి భావి తరాల వైద్యవిద్యార్థుల పరిశోధనల నిమిత్తం ఆయన భౌతిక కాయం చేరకుంది.

➡️