- 16వ ఆర్థిక సంఘానికి కేరళ వినతి
- కేంద్రం తోడ్పాటువుంటేనే రాష్ట్రాల ప్రగతి
ప్రజాశక్తి ప్రతినిధి – తిరువనంతపురం : దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించే బృహత్తర బాధ్యత 16వ ఆర్థిక సంఘానిదని, అలాంటి బాధ్యతను సమాఖ్య స్ఫూర్తికి విఘాతంగా కలగకుండా నిర్వర్తించాలని కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సంతృప్తికర తోడ్పాడు ఉంటేనే రాష్ట్రాల ప్రగతి సాధ్యమని ఆయన తెలిపారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ అరవింద్ పనగారియా నేతృత్వంలోని బృందం కేరళలో పర్యటిస్తోంది. తొలి రోజైన మంగళవారం ఆర్థిక సంఘం బృందానికి బాలగోపాల్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళకు నిధుల కేటాయింపుల్లో న్యాయం చేయాలని విన్నవించారు. ‘కేరళ అభివృద్ధి నమూనా’ కింద రాష్ట్రం సాధించిన విజయాలను ఆయన వివరించారు. ఈ విజయాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లభించిన పురస్కారాలు, ప్రశంసలు గురించి గుర్తు చేశారు. అయితే మౌలిక వసతుల అభివృద్ధిలో కేరళ సాధించాల్సింది ఇంకా చాలా ఉందని, ఇందుకు కేంద్రం, ఆర్థిక సంఘం సహకరించాలని కోరారు. ముఖ్యంగా ఉన్నత విద్య, పరిశోధన వంటి రంగాల్లో చేయాల్సింది చాలా వుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వున్నప్పటికీ ఈ అంతరాలను పూడ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే వుందని చెప్పారు. 10 నుండి 15వ ఆర్థిక సంఘం వరకు కేంద్రం నిధుల్లో కేరళ వాటా తగ్గిపోవడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. 10వ ఆర్థిక సంఘంలో 3.88 శాతం వాటా రాగా 15వ ఆర్థిక సంఘం నాటికి అది 1.92 శాతానికి పడిపోయిందన్నారు. పర్యావరణ విపత్తుల వల్ల ఆర్థికంగా ఎన్ని ఎదురు దెబ్బలు రాష్ట్రాభివృద్ధి కోసం కేరళ ప్రభుతవం కృషి చేస్తోందని, ఇందుకు కేంద్రం కూడా చేయూతనందించాలని కోరారు. ప్రకృతి విపత్తుల వేళ ఆర్థికంగా ఆదుకోవాల్సిన కేంద్రం ఆ పని చేయడం లేదన్నారు. 16వ ఆర్థికసంఘంగానైనా కేరళకు ఆర్థిక కేటాయింపులు విషయంలో న్యాయం చేయాలని కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణలో కేరళ ఆదర్శనీయమైన కృషి చేస్తోందని తెలిపారు. స్థానిక ప్రభుత్వాలకు నిధులను అందచేయడంలోనూ, వారి కార్యకలాపాలను వికేంద్రీకరించడంలోనూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ముందుందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక, ద్రవ్యపరమైన ఆందోళనలను పరిష్కరించాల్సిందిగా కోరారు. అభివృద్ధి ప్రాధాన్యతలను అమలు చేయాల్సిందిగా కోరుతూ 16వ ఆర్థిక సంఘం సభ్యులకు బాలగోపాల్ మెమోరాండాన్ని అందచేశారు.