- ఆయన తనయుడు నిఖిల్, జెడిఎస్ నేత సురేష్‌పై కూడా
బెంగళూరు : సీనియర్ ఐపిఎస్ అధికారిని బెదిరించారన్న ఆరోపణలతో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామి, ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి, జెడి (ఎస్) నాయకుడు సురేష్ బాబులపై సంజరు నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అడిషనల్ డిజిపి ఎం చంద్రశేఖర్ ఫిర్యాదుతో బిఎన్‌ఎస్ చట్టం సెక్షన్ 224 ప్రకారం ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. శ్రీసాయి వెంకటేశ్వర మినరల్స్ (ఎస్‌ఎస్‌విఎం)కి మైనింగ్ లీజుకు అక్రమంగా అనుమతించారంటూ కుమారస్వామిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసును విచారిస్తున్న కర్ణాటక లోకాయుక్త దర్యాప్తు బృందానికి చంద్రశేఖర్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన కుమారస్వామిని విచారించడానికి కర్ణాటక గవర్నర్ అనుమతిని కోరారు. ఈ సందర్భంలోనే కుమారస్వామి సెప్టెంబర్ 28, 29 తేదీల్లో నిర్వహించిన మీడియా సమావేశాల్లో తనపై అసత్య ఆరోపణలు చేశారని చంద్రశేఖర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.