మణిపూర్‌ సిఎం భద్రతా కాన్వాయ్ పై కాల్పులు.. శ్రీ ఇద్దరికి గాయాలు

Jun 10,2024 23:57 #cm attack, #Manipur

ఇంఫాల్‌ : మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు వెళుతున్న భద్రతా సిబ్బంది కాన్వాయ్ పై గుర్తు తెలియని సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో వాహన డ్రైవర్‌తో సహా ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. జాతీయ రహదారి-53పై కోట్లెన్‌ గ్రామం వద్ద సోమవారం ఘటన జరిగింది. గతవారంలో హింసాకాండ చెలరేగిన జిరిబామ్‌ పట్టణంలో ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ మంగళవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను సిద్ధం చేయడానికి మణిపూర్‌ పోలీస్‌కు చెందిన ఒక అధునాతన భద్రతా బృందం అక్కడకు బయలుదేరింది. ఈ సమయంలో సాయుధులు అనేక రౌండ్ల పాటు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా భద్రతా సిబ్బంది కూడా ఎదురు కాల్పులకు దిగారు. జిరిబామ్‌ జిల్లాలో ఈ నెల 8న రెండు పోలీసు అవుట్‌ పోస్టులను, ఒక ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీస్‌ను, దాదాపు 70 ఇళ్లను సాయుధులు దగ్ధం చేశారు.

➡️