పిఎం కిసాన్‌పై తొలి సంతకం

Jun 11,2024 07:49 #first signature, #PM Kisan
  • అధికారిక బాధ్యతలు స్వీకరించిన మోడీ
  • మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి తొలి కేబినెట్‌ ఆమోదం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత నరేంద్ర మోడీ ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ 17వ విడత నిధుల విడుదల ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ.20 వేల కోట్లను 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు.ఫైలుపై సంతకం చేసిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం తమవంతు కృషి చేస్తామని తెలిపారు.

ప్రధానిగా అధికారిక బాధ్యతలు చేపట్టిన మోడీ
దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, సోమవారం అధికారికంగా బాధ్యతలు చేప ట్టారు. సౌత్‌ బ్లాక్‌లోని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ)లో మోడీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది.

పిఎంఎవై కింద మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం : తొలి మంత్రివర్గం ఆమోదం
ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పిఎంఎవై) కింద పేదలకు మరో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి మంత్రివర్గం సమావేశం 7 లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాసంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగింది. మోడీ మంత్రివర్గ సహచరులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జెపి నడ్డా, నిర్మలా సీతారామన్‌, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, కిరణ్‌ రిజిజు, చిరాగ్‌ పాశ్వాన్‌, గిరిరాజ్‌ సింగ్‌, మన్షుఖ్‌ మాండవీయ, హర్దీప్‌ సింగ్‌ పురి, కె.రామ్మోహన్‌ నాయుడు, జి.కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️