న్యూఢిల్లీ : ప్రతికూల వాతావరణం కారణంగా ఒక ట్రెక్కింగ్ బృందం దారి తప్పడంతో ఇందులోని ఐదుగురు సభ్యులు మరణించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీ జిల్లాలోని సహస్త్ర తాల్‌లో జరిగింది. బుధవారం సాయంత్రం వరకూ 13 మందిని రక్షించారు. మొత్తంగా 22 మంది ఉన్న ఈ ట్రెక్కింగ్ బృందంలో మిగిలిన సభ్యులను రక్షించడానికి భారత వైమానిక దళం కూడా ప్రయత్నిస్తోంది. ఈ ఘటన గురించి ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ మెహర్బన్ సింగ్ బిష్ణు వివరాలు వెల్లడించారు. ఈ ట్రెక్కింగ్ బృందం కర్ణాటకకు చెందినదిగా తెలిపారు. హిమాలయన్ వ్యూ ట్రాకింగ్‌్ అనే ట్రెక్కింగ్ ఏజెనీ సహాయంతో ముగ్గురు గైడ్లతో కలిసి ఈ బృందం మే 29న సహస్త్రతాల్‌కు యాత్రను ప్రారంభించిందని, ఈ నెల 7న తిరిగిరావాల్సి ఉందని చెప్పారు. అయితే ఈ నెల 4న బృందం దారితప్పిపోయిందని ఏజెన్సీ అధికారులకు సమాచారం ఇచ్చిందని కలెక్టర్ తెలిపారు. దీంతో ట్రెక్కింగ్ బృందాన్ని రక్షించడానికి ఎస్‌డిఆర్‌ఎఫ్, స్థానిక పోలీసుల బృందాలను తరలించినట్లు చెప్పారు. రక్షించిన 13 మందిని ఆరోగ్య పరీక్షల కోసం వివిధ ఆసుపత్రులకు తరలించారు. కాగా, సహాస్త్ర తాల్ అనేది 4,100 నుంచి 4,400 మీటర్ల ఎత్తులో ఒక పర్వత శిఖరంపై ఉన్న ఏడు సరస్సుల సమూహం.
