ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న అర్థరాత్రి గుడిహత్నుర్ మండలం మేకలగండి సమీపంలో మాక్స్ పికప్ వాహనం సైడ్ పిల్లర్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడినవారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతులు మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40),అలీ (8),ఉస్మానొద్దీన్ (10),ఉస్మాన్ (12) గా పోలీసులు గుర్తించారు. మృతులంతా ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందినవారని తెలుస్తోంది. భైంసాలో ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.