- వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యతకు కృషి
- సిపిఎం ముసాయిదా రాజకీయ తీర్మానం విడుదల
ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : పార్టీ స్వతంత్ర బలం పెంచుకునేందుకు తగిన వ్యూహాన్ని రూపొందించడంపై దృష్టిసారించనున్నట్లు సిపిఎం ముసాయిదా రాజకీయ తీర్మానం ఉద్ఘాటించింది. ఏప్రిల్ 2 – 6 తేదీల మధ్య మదురైలో జరగనున్న సిపిఎం 24వ అఖిల భారత మహాసభ ముందు ఉంచడం కోసం రూపొందించిన ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని పార్టీ సభ్యులు, ప్రజల పరిశీలన, సూచనలు, సవరణలు, సలహాల నిమిత్తం సోమవారం నాడిక్కడ సిపిఎం పొలిట్‌బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్ కరత్ విడుదల చేశారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై సైద్ధాంతిక పోరాటం కొనసాగుతుందని ఆయన మీడియాకు తెలిపారు. ఎన్నికల్లో బిజెపి వ్యతిరేక ఓట్లను వీలైనంత ఎక్కువగా సంఘటితం చేసేందుకు లౌకిక, ప్రజాతంత్ర పార్టీలతో కలుపుకుని విశాల వేదిక ఏర్పాటు కోసం కృషి కొనసాగుతుందని చెప్పారు. ఇది ఇండియా బ్లాక్‌కు మాత్రమే పరిమితం కాదని, ఇంతకుమించిన వేదిక ఏర్పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి గత మహాసభలో తీసుకున్న విధానంలో చెప్పుకోదగ్గ మార్పులేవీ లేవని చెప్పారు. వామపక్షాల ఐక్యతను పటిష్టపరుచుకోవడానికి ముసాయిదా రాజకీయ తీర్మానం పిలుపునిస్తోందని అన్నారు. లౌకిక, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని విశాలమైన వేదిక ఏర్పాటుకు కృషి కొనసాగుతోందని చెప్పారు. త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పార్టీ తిరిగి పుంజుకునేందుకు కృషి చేస్తామన్నారు.
జనవరి 17 నుంచి మూడు రోజులపాటు కొల్‌కతాలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని ఖరారు చేశామని తెలిపారు. ముసాయిదా తీర్మానంపై వచ్చే సూచనలు, సవరణలు పరిశీలించి మార్చి 22, 23 తేదీల్లో కేంద్ర కమిటీ తుది ముసాయిదాను రూపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు తపన్‌సేన్, అశోక్‌దావలే, నీలోత్పల్ బసు పాల్గొన్నారు.