అందుకే జమిలీపై బీజేపీ దృష్టి
ఈ ఏడాది హిందూత్వ సంస్థకు వందేండ్లు
సంఘ్ సుదీర్ఘ వాంఛను నెరవేర్చేందుకు మోడీ యత్నం
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు వన్ నేషన్-వన్ ఎలక్షన్(ఓఎన్‌ఓఈ)పై తీవ్రంగానే శ్రమిస్తోంది. దీనిని ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే అటువైపుగా చర్యలు ప్రారంభించింది. ఇందుకు కావాల్సిన గ్రౌండ్‌వర్క్‌ను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే భారత మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లను వేసింది. ఈ కమిటీలు చర్చలూ జరిపాయి. నివేదికలనూ అందించాయి. అయితే, బీజేపీ తాపత్రయమంతా దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ కోరికను తీర్చటం కోసమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనేది సదరు హిందూత్వ సంస్థ వాంఛ అనీ, దానిని ఏ విధంగానైనా నెరవేర్చాలని మోడీ భావిస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం దేశంలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదన, దక్షిణాది మెడపై కత్తిని పెట్టే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, ఈ-ఓటింగ్ ప్రతిపాదన పునరుద్ధరణ, నకిలీ ఓట్ల స్కాం గురించి తీవ్ర చర్చ నడుస్తున్నది. మోడీ సర్కారు జమిలీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిని సారించింది. ఏకకాల ఎన్నికలనేది బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ చిరకాల వాంఛ. దానికి అనుగుణంగానే మోడీ సర్కారు పని చేస్తున్నది. అంతేకాదు, ఈ ఏడాదిలో ఆరెఎస్‌ఎస్‌కు వందేండ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో వన్ నేషన్‌ావన్ ఎలక్షన్‌ను తీసుకొచ్చి ఆర్‌ఎస్‌ఎస్‌కు బహుమతిగా ఇవ్వాలని మోడీ ప్రభుత్వం యోచిస్తున్నది.
ధీరేంద్ర కె.ఝా కొత్త పుస్తకం ” గోల్వాల్కర్ : ది మిత్ బిహైండ్ ది మ్యాన్, ది మ్యాన్ బిహైండ్ ది మెషిన్” ఇదే విషయాన్ని తెలియజేస్తున్నది. ” శాసనసభ నుంచి వారి దైనందిన జీవితాల వరకు, ముస్లింల పౌర హక్కులను నిరాకరిస్తామనే గోల్వాల్కర్ వాగ్దానం నెరవేర్చే ప్రయత్నం సాగడం రాజకీయంగా, ముస్లిములను కనుమరుగు చేసేస్తున్నారు. గోల్వాల్కర్ ఆలోచనలకు, భారత్‌ను హిందూ రాష్ట్రంగా మార్చటం అనే ఆయన ఆర్‌ఎస్‌ఎస్ కోసం నిర్దేశించిన చారిత్రక విధికి అనుగుణంగా ఉండటం వల్లే ఇదంతా సంఫ్‌ు పరివారల్‌లో విస్తృత ఆమోదం పొందింది” అని వివరించారు. జమిలీ ఎన్నికలు ఆర్‌ఎస్‌ఎస్ రెండో చీఫ్ భావనలకు దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు. ఏకీకృత ప్రభుత్వ విధానానికి ఆయన బలమైన మద్దతుదారు అని వివరించారు.
జమిలీ ఎన్నికలపై 2023, సెప్టెంబర్ 2న భారత మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పడింది. గతేడాది మార్చి 14న 18 వేల పేజీలతో కూడిన తన తుది నివేదికను ప్రస్తుత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాంనాథ్ కోవింద్ సమర్పించారు. అయితే, మోడీ సర్కారు జమిలీ ఎన్నికల ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతే వచ్చింది. కాంగ్రెస్, సీపీఐ(ఎం)తో పాటు అనేక ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఇది భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని ఉల్లంఘించటంలో పలు న్యాయపరమైన చిక్కులు తీసుకొస్తాయనీ, పరోక్షంగా అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తుందని పలు ప్రశ్నలను, అనుమానాలను లేవనెత్తాయి.
ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్‌ను ఏకపక్షంగా నియమించటం కూడా ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది. ఈయనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంచి సంబంధాలు కూడా ఉండటం గమనార్హం. ఆర్‌ఎస్‌ఎస్ చిరకాల వాంఛ అయిన ‘హిందూ రాష్ట్ర’ను దేశంలో తీసుకురావటానికి మోడీ సర్కారు ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నది. ఈ ప్రక్రియ సాఫీగా సాగాలంటే సీఈసీగా తాము చెప్పినట్టు వినే వ్యక్తి ఉండాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగానే సీఈసీగా పదవి నుంచి దిగిపోయిన రాజీవ్ కుమార్ స్థానంలో జ్ఞానేశ్ కుమార్‌ను మోడీ తీసుకొచ్చారని విశ్లేషకులు అంటున్నారు. స్వతంత్ర రాజకీయ సంస్థగా ఉండాల్సిన ఎన్నికల సంస్థను కేంద్రంలోని మోడీ సర్కారు పలు సందర్భాలలో స్వేచ్ఛగా పని చేయనివ్వలేదనీ, పలు ఎన్నికల్లో ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పని చేసిందని ప్రతిపక్ష పార్టీలు పలు సందర్భాలలో ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఓటర్ల జాబితాలో చేరికలు, తొలగింపులపై కూడా ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది అసలైన ప్రజాతీర్పుపై ప్రభావాన్ని చూపుతుందని అంటున్నాయి.
జమిలీ ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణలు అవసరం. ఇందుకు పార్లమెంటులోని ఉభయ సభల్లో కనీసం మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. దీనిని సూపర్‌మెజారిటీ అంటారు. అంటే.. లోక్‌సభలో 362 మంది, రాజ్యసభలో 167 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అయితే, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అంత బలం లేదు. లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యులే ఉన్నారు. అంతేకాదు, గతేడాది సెప్టెంబర్‌లో జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. అదే ఏడాది డిసెంబర్‌లో పార్లమెంటు ముందుకు బిల్లును తీసుకొచ్చింది. లోక్‌సభలో 269 మంది అనుకూలంగా, 198 మంది వ్యతిరేకంగా ఈ బిల్లుకు ఓటు వేశారు. దీంతో జమిలీ అసాధ్యమనీ, కావాల్సిన మెజారిటీని మోడీ సర్కారు సాధించలేకపోయిందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి.