- డెప్సాంగ్, డెమ్‌చాక్ ప్రాంతాల్లో
- ముగిసిన బలగాల ఉపసంహరణ
న్యూఢిల్లీ : చైనా వెంబడి భారత్ సరిహద్దులో సైనిక బలగాలను ఇరుదేశాలు వెనక్కి పిలిపించాయి. తూర్పు లడఖ్‌లోని డెప్సాంగ్, డెమ్‌చాక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ పూర్తయిందని భారత సైనిక అధికారులు బుధవారం వెల్లడించారు. త్వరలో గస్తీ కార్యకలాపాలు పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. అందుకు అనుసరించాల్సిన పద్దతులు రూపొందించాల్సివుందని పేర్కొన్నారు. చేపట్టాల్సిన పద్దతులు, విధి విధానాలపై పదాతిదళ కమాండర్లు కసరత్తు చేస్తున్నారని వెల్లడించారు. కోల్‌కతాలో చైనా రాయబారి గ్జూ ఫెయింగ్ మాట్లాడుతూ ఇరు దేశాలు అనేక ముఖ్యమైన అవగాహనలు కుదుర్చుకున్నాయని తెలిపారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా సమావేశమైన మోడీ, జిన్‌పింగ్‌లు కుదుర్చుకున్న అవగాహన భవిష్యత్ సంబంధాల వృద్ధికి మార్గదర్శకంగా వుంటుందని చెప్పారు. ఇరుగు పొరుగు దేశాలు కొన్ని విభేదాలు వుండడం సహజమే, అయితే వాటిని ఎలా ఎదుర్కొనాలి, ఎలా పరిష్కరించుకోవాలనేది అంతకంటే ముఖ్యమైన అంశమని ఆయన వ్యాఖ్యానించారు. దీపావళి సందర్భంగా గురువారం భారత్, చైనా సరిహద్దు పాయింట్ల వద్ద సిబ్బంది మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు. బ్రిగేడియర్లు, దానికన్నా కింది స్థాయిలోని గ్రౌండ్ కమాండర్ల మధ్య సమావేశాల్లో గస్తీ పద్దతులపై నిర్ణయం తీసుకుంటారు. ఉభయ పక్షాల సమన్వయంతో గస్తీ చేపడతారు. 20 మంది సైనికుల కన్నా తక్కువ మందితోనే బృందాలు ఏర్పాటు చేయవచ్చునని భావిస్తున్నారు. సరిహద్దుల్లో ఘర్షణలను నివారించేందుకు ముందుగా అంగీకారం కుదిరిన మేరకు ఈ గస్తీ చర్యలు నిర్వహిస్తారు.