న్యూఢిల్లీ : మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా (79) శనివారం కన్నుమూశారు. మెదడుకు శస్త్రచికిత్స కోసం ఢిల్లీలోని ఆపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన చావ్లా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని మరో మాజీ సీఈసీ ఎస్‌వై ఖురైషి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నవీన్ చావ్లా 2005 నుంచి 2009 వరకు ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా, ఆ తర్వాత 2009 ఏప్రిల్ నుంచి 2010 జూలై వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా పనిచేశారు.
కాగా, ఎన్నికల సంఘంలో ఉన్నప్పుడు నవీన్ చావ్లాను పలు వివాదాలు చుట్టుముట్టాయి. నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆయన పక్షపాత వైఖరితో వ్యవహరించినట్లు ఆరోపించింది. 2006లో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎల్‌కే అద్వానీ, 204 మంది ఎంపీలు చావ్లాను ఎన్నికల కమిషనర్‌గా తొలగించాలని కోరుతూ అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు ఒక పిటిషన్ సమర్పించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా బీజేపీ ఆశ్రయించింది.
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో 2009లో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న చావ్లాను తొలగించాలని నాటి సీఈసీ గోపాలస్వామి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా నవీన్ చావ్లాను సీఈసీగా ప్రమోట్ చేసింది. అనంతరం ఎన్నికల కమిషనర్లకు రక్షణ కోసం సంబంధిత చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సిఫార్సు చేశారు. అలాగే థర్డ్ జండర్‌ను ‘ఇతరుల’ కేటగిరీలో ఓటర్లుగా నమోదు కోసం అనుమతించాలని ఒత్తిడి తెచ్చారు.
కాగా, 1945 జూలై 30న జన్మించిన నవీన్ చావ్లా, హిమాచల్ ప్రదేశ్‌లోని సనావర్‌లో ఉన్న ది లారెన్స్ స్కూల్‌లో పాఠశాల విద్య, ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. సివిల్ సర్వీస్ కెరీర్‌లో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. అప్పుడప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆయన పని చేసినప్పటికీ ఉద్యోగ జీవితం ఎక్కువగా ఢిల్లీలోనే కొనసాగింది. ఈసీగా నియామకం ముందు కేంద్ర కార్యదర్శిగా ఉన్నారు. 2009 లోక్‌సభ ఎన్నికలను ఆయన పర్యవేక్షించారు. మదర్ థెరిసా జీవిత చరిత్రపై పుస్తకాలు కూడా ఆయన రాశారు.