కొత్త పార్టీ ఏర్పాటు : జార్ఖండ్‌ మాజీ సిఎం చంపయీ సోరెన్‌ ప్రకటన

రాంచీ : మరో వారం రోజుల్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌ ప్రకటన చేశారు. ఎక్స్‌ వేదికగా బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. అనంతరం స్థానిక మీడియాతోనూ మాట్లాడారు. ‘రాజకీయాల నుంచి రైటైర్‌ అవ్వాలా, కొత్త పార్టీ ఏర్పాటు చేయాలా? ఇతర మిత్రులతో కలిసి ముందుకు సాగాలా?’ అనే అంశాలను పరిశీలించానని చంపయీ సోరెన్‌ అన్నారు. చివరికి కొత్త పార్టీ ఏర్పాటు చేసి, బలోపేతం చేస్తానని, మంచి మిత్రులతో కలిసి ముందుకు సాగుతానని ప్రకటించారు. జార్ఖండ్‌లో ఎలాగైనా పాగా వేయాలని ఎత్తులు వేస్తున్న బిజెపి అగ్రనాయకత్వం మనీలాండరింగ్‌ కేసులో జెఎంఎం అధినేత హేమంత్‌ సోరెన్‌ను గతంలో జైలు పాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ హైకోర్టు ఆయనను విడుదల చేయడంతో… జెఎంఎంను బలహీనం చేసేందుకు ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగా హేమంత్‌ సోరెన్‌ జైలుకు వెళ్లినప్పుడు సిఎంగా సుమారు ఐదు నెలలపాటు బాధ్యతలు నిర్వహించిన కీలక నేత చంపయీ సోరెన్‌పై దృష్టి పెట్టింది. ఆయన బిజెపిలో చేరేందుకు ఆదివారం ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరగ్గా, తాజాగా పార్టీ ఏర్పాటు చేస్తున్నానని చంపయీ సోరెన్‌ ప్రకటించడం గమనార్హం.

➡️