సునీత కేజ్రీవాల్‌తో సమావేశమైన కల్పనా సోరెన్‌

న్యూఢిల్లీ   :    జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. శనివారం 6 ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్‌లోని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నివాసంలో ఆమెను కలుసుకున్నారు. వీరిద్దరు సుమారు 15-20 నిమిషాల పాటు సమావేశం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కల్పనా సోరెన్‌ మాట్లాడుతూ రెండు నెలల క్రితం జార్ఖండ్‌లో జరిగిన ఘటన మాదిరిగానే ఢిల్లీలో కూడా జరిగిందని అన్నారు.

జార్ఖండ్‌లో భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జనవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) హేమంత్‌ సోరెన్‌ను అరెస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.

తాను సునీతను కలుసుకునేందుకు వచ్చానని, ఆమె భాధ్యతలను కూడా పంచుకుంటానని అన్నారు. తాము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతిజ్ఞ చేశామని కల్పనా సోరెన్‌ చెప్పారు. జార్ఖండ్‌ రాష్ట్రం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెంట ఉంటుందని, తాను కాంగ్రెస్‌ పార్లమెంటరీ కమిటీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీని కలవబోతున్నానన్నారు. రాంలీలా మైదాన్‌లో జరిగే ఇండియా కూటమి బహిరంగ సభకు హాజరవుతానన్నారు.

ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌ భారీ బహిరంగ సభకు ఇండియా ఫోరం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

➡️