టిడిపికి నాలుగు, జెడియుకి రెండు

  • జనసేనకు ఒకటి, ఏపి బిజెపి నుంచి ఒకరు
  • కేంద్ర మంత్రిమండలిలో చోటు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో బోటాబోటీ స్థానాలతో గట్టెక్కిన బిజెపి లోక్‌సభలో సాధారణ మెజారీటిగా దూరంగా ఉండిపోవడంతో ఈ దఫా ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షాలపైనే పూర్తిగా ఆధారపడాల్సివస్తోంది. ప్రధానంగా కూటమిలో బిజెపి తర్వాత అధిక స్థానాల్లో విజయం సాధించిన టిడిపి, జెడియు ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కెబినెట్‌లో ఆ పార్టీల నుంచి బెర్తుల కోసం డిమాండ్‌ ఏర్పడింది. టిడిపికి నాలుగు శాఖలు, జెడియుకు రెండు శాఖలు దక్కే వీలుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డిఎ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేనకు ఒక కేబినెట్‌ పదవి ఇచ్చే వీలుంది. దీంతోపాటు రాష్ట్ర బిజెపి నుంచి ఒకరికి అవకాశం కల్పించనున్నారు. కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న నలుగురు టిడిపి నేతలలో రామ్మోహన్‌ నాయుడు (శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్‌ (గుంటూరు), హరీష్‌ బాలయోగి (అమలాపురం), దగ్గుమళ్ల ప్రసాద్‌ (చిత్తూరు) ఉన్నారు. జనసేన నుంచి కాకినాడ ఎంపి తంగెళ్ళ ఉదరు శ్రీనివాస్‌, బిజెపి నుంచి అనకాపల్లి ఎంపి సిఎం రమేష్‌ కు కేంద్రమంత్రి పదవులు దక్కనున్నాయి. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జెడియు నుంచి ఇద్దరు సీనియర్‌ నేతలు లాలన్‌ సింగ్‌, రామ్‌ నాథ్‌ ఠాకూర్‌ పేర్లను కేబినెట్‌ బెర్తుల కోసం ఆ పార్టీ ప్రతిపాదించింది. లాలన్‌ సింగ్‌ బీహార్‌ ముంగేర్‌ నుంచి లోక్‌ సభకు ఎన్నిక కాగా, రామ్‌ నాథ్‌ ఠాకూర్‌ రాజ్యసభ ఎంపిగా ఉన్నారు. ఠాకూర్‌ భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్‌ కుమారుడు కావడం విశేషం.

➡️