ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు యూట్యూబర్లు మృతి

అమ్రోహా (ఉత్తరప్రదేశ్‌) : ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బొలెరో వాహనాలు ఢకొీట్టుకోవడంతో కారులో ఉన్న నలుగురు యూ ట్యూబర్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. మీడియాకు అందిన సమాచారం మేరకు …. ఈ ఘటన హసన్‌పూర్‌ గజ్రౌలా రోడ్డులోని మనోటా బ్రిడ్జి సమీపంలో జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడివారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ యూట్యూబర్‌లు ‘రౌండ్‌ టు వరల్డ్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ని నడుపుతున్నారు. ఆ కారులోని వారంతా అమ్రోహాలోని హసన్‌పూర్‌లో విందు ముగించుకుని తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. మృతులను లక్కీ, సల్మాన్‌, షారుక్‌, షెహ్నవాజ్‌గా గుర్తించారు. వీరంతా కామెడీ వీడియోలను రూపొందిస్తుంటారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️