ప్రతి వ్యక్తికీ ఉచిత రేషన్‌ రెట్టింపు : కాంగ్రెస్‌ హామీ

May 17,2024 00:36 #Congress, #ration rice, #rice

న్యూఢిల్లీ : కర్ణాటకలో తమ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అన్న భాగ్య’ (పేదలకు 10 కిలోల ఉచిత బియ్యం పథకం)ను కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. దేశంలో ఆహార రేషన్ల గురించి బిజెపి అబద్ధాలు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఎన్నికల తరువాత ఇండియా వేదిక అధికారంలోకి వస్తే, ప్రస్తుత బిజెపి ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్‌ పరిమాణాన్ని రెట్టింపు చేస్తామని పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించిన ఒక రోజు తరువాత కాంగ్రెస్‌ గురువారం ఈ ప్రకటన వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘2013లో కేంద్రంలోని మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఆమోదించి 2011 జనాభా లెక్కల ప్రకారం 80 కోట్ల మంది భారతీయులకు ధాన్యాలను అందించింది. అప్పుడు ఒకే ఒక ముఖ్యమంత్రి (నరేంద్రమోడీ, గుజరాత్‌) మాత్రమే ఈ చట్టాన్ని రాత పూర్వకంగా వ్యతిరేకించారు’ అని రమేష్‌ గుర్తు చేశారు. ఇదే పథకాన్ని మోడీ ప్రధానమంత్రి అయ్యాక ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన’గా పేరు మార్చి ‘ఉచిత రేషన్‌’ పథకంగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు’ అని రమేష్‌ విమర్శించారు. 2021లో జరగాల్సిన జన గణనను నిర్వహించకపోవడం ద్వారా మోడీ ప్రభుత్వం కనీసం 14 కోట్ల మంది భారతీయులకు ఈ ప్రయోజనాలను నిరాకరించిందని రమేష్‌ విమర్శించారు.

➡️