పశ్చిమ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం అవసరం !

Apr 11,2025 22:29 #Free Trade Agreement, #Jai Shankar

విదేశాంగమంత్రి జై శంకర్‌ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : స్వేచ్ఛా వాణిజ్యంపై పశ్చిమ దేశాలతో భాగస్వామ్యం పెంచుకోవాల్సిన ఆవశ్యకత వుందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాల్లోనే వాస్తవ పురోగతి సాధ్యమవుతుందని, అక్కడ మరిన్ని అవకాశాలు వుంటాయని, అందువల్ల మన వాణిజ్య భాగస్వాములు అక్కడే వుంటారని మనలో చాలామంది వాదిస్తుంటారని అన్నారు. తూర్పు దేశాల్లోని ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత పోటీ తత్వంతో కూడి వుంటాయన్నారు. అమెరికా, బ్రిటన్‌, యురోపియన్‌ యూనియన్‌లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించినట్లైతే అవకాశాలు మెండుగా వుంటాయని అన్నారు. కార్నేజ్‌ ఇండియా వార్షిక అంతర్జాతీయ టెక్నాలజీ సదస్సులో జై శంకర్‌ మాట్లాడారు. భారత్‌ స్వావలంబనకు అనుగుణంగా మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ ఉద్యమాన్ని చూడాలా అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ మంత్రి, ఇందులో పరస్పర విరుద్ధమైన భావన నెలకొందని తాననుకోవడం లేదన్నారు. ప్రపంచం దిశ గురించి నిష్పాక్షికంగా ఆలోచించే వారెవరైనా ఈ ధోరణులను గమనిస్తారని అన్నారు. ఇదేమీ ఒక్కసారిగా ఊడిపడింది కాదని వ్యాఖ్యానించారు. తక్కువ వ్యయంతో తయారయ్యే ఉత్పత్తులు మూకుమ్మడిగా గుమ్మరించబడడం పట్ల మనదేశంలోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఇవి ప్రభావాన్ని చూపిస్తాయన్నారు.

➡️