ఉపాధ్యాయుడి నుంచి సిఎం వరకూ బుద్ధదేవ్‌ ప్రస్థానం

Aug 9,2024 09:45 #Buddhadev, #prastanam

సాహిత్యంలోనూ విశేష కృషి
ప్రజాశక్తి-కొల్‌కతా :బుద్ధదేవ్‌ భట్టాచార్య పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర అభివృద్ధికి, అభ్యుదయ ఉద్యమాలకు ఎన్నో సేవలందించారు. 1944 మార్చి 1వ తేదీన ఉత్తర కోల్‌కతాలోని బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో బుద్ధదేవ్‌ జన్మించారు. శైలేంద్ర సర్కార్‌ విద్యాలయలో విద్యనభ్యసించి, కోల్‌కతా ప్రెసిడెన్సీ కళాశాలలో బెంగాలీ సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. బెంగాలీ (ఆనర్స్‌)లో బిఎ డిగ్రీ పొందారు. డమ్‌డమ్‌లోని ఆదర్శ్‌ షంకా విద్యామందిర్‌లో కొంతకాలం ఉపాధ్యాయుడిగా చేశారు. అనంతరం 1966లో రాజకీయాలకు పూర్తిగా అంకితమై సిపిఐ (ఎం)లో చేరారు. బుద్ధదేవ్‌లోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన నేత ప్రమోద్‌ దాస్‌గుప్తా. బెంగాల్‌లో బిమన్‌ బోస్‌, అనిల్‌ బిశ్వాస్‌, సుభాష్‌ చక్రవర్తి, శ్యామల్‌ చక్రవర్తి వంటి నేతలతో పాటు బుద్ధదేవ్‌కు కూడా ఆయన రాజకీయ గురువుగా వ్యవహరించారు. 1968 జూన్‌లో డివైఎఫ్‌ బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు. 1971లో సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడుగా, 1982లో పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడిగా పనిచేశారు. 1984లో కేంద్ర కమిటీకి శాశ్వత ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. 1985లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2000వ సంవత్సరంలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు.
చట్టసభలో ప్రవేశం
1977లో తొలిసారి కొస్సిపూర్‌ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 33 సంవత్సరాల వయసులో, జ్యోతిబసు నేతృత్వంలో ఏర్పడిన తొలి వామపక్ష ప్రభుత్వంలో సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1982 ఎన్నికలలో ఓటమి పాలైన బుద్ధదేవ్‌, 1987లో జాదవ్‌పూర్‌ నియోజకవర్గం నుండి గెలుపొంది తిరిగి సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా రాష్ట్ర క్యాబినెట్‌లో చేరారు. ఓ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు రావడంతో 1993లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ముఖ్యమంత్రి జ్యోతిబసుకు ప్రత్యామ్నాయ నేత కోసం సిపిఐ (ఎం) అన్వేషిస్తున్న సమయంలో బుద్ధదేవ్‌ను మళ్లీ రాష్ట్ర క్యాబినెట్‌లోకి తీసుకొని 1996లో హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకే… అంటే 1999లో ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
సిఎంగా ఎనలేని సేవలు
2000 నుండి 2011 వరకూ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి ఏడవ ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్‌ సేవలందించారు. 2000వ సంవత్సరం నవంబరులో జ్యోతిబసు స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2001 ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్‌కు నాయకత్వం వహించి ఎన్నికల్లో ఘన విజయం సాధించి పెట్టారు. ఆయన తన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు ఎనలేని కృషి చేశారు. 2006 ఎన్నికల్లో వామపక్ష కూటమి విజయం సాధించడంతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. పారిశ్రామికీకరణ కోసం అలుపెరుగని కృషి చేసిన బుద్ధదేవ్‌కు ‘బ్రాండ్‌ బుద్ధ’ అనే పేరు వచ్చింది. వయోభారం కారణంగా బుద్ధదేవ్‌ 2015లో సిపిఐ (ఎం) పొలిట్‌బ్యూరో నుండి, కేంద్ర కమిటీ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యత్వాన్ని వదులుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఆయన ప్రజల్లోకి రావడం లేదు. దక్షిణ కోల్‌కతాలోని పామ్‌ అవెన్యూలో రెండు గదుల ప్రభుత్వ ఫ్లాటులోనే కాలం గడిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన చిట్టచివరిసారిగా ప్రజల ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. బ్రిగేడ్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ర్యాలీకి ఆక్సిజన్‌ సాయంతో వచ్చి పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచారు.
బుద్ధదేవ్‌ 60వ దశకం చివరలో వియత్నాం సంఘీభావ కమిటీలో ముఖ్య భూమిక పోషించారు. సైగన్‌ (హోచిమిన్‌ సిటీ) విముక్తి తర్వాత ప్రసిద్ధి చెందిన లే డక్‌ తో కవితను 1975లో అనువదించారు. హోచిమిన్‌ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వియత్నాంలో పర్యటించారు. ప్రమోద్‌ దాస్‌గుప్తాతో పాటు 1982లో చైనాను సందర్శించారు. తన జీవితంలో ఎన్నో విజయాలు, అపజయాలు ఎదురైనప్పటికీ స్థితప్రజ్ఞతతో ముందుకు సాగిన బుద్ధదేవ్‌ తుదిశ్వాస విడిచే వరకూ ప్రజల బాగోగుల కోసమే తపించారు. బెంగాల్‌ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

➡️