సుప్రీం తీర్పుతో 10 చట్టాలకు గెజిట్‌

  • తమిళనాడు ప్రభుత్వ చారిత్రక నిర్ణయం
  • గవర్నర్‌, రాష్ట్రపతి ఆమోదం లేకుండానే
  • చట్టాలుగా మారిన బిల్లులు

చెన్నై : తమిళనాడు ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఆత్మస్థైర్యంతో… గవర్నర్‌, రాష్ట్రపతి ఆమోదం లేకుండానే పది చట్టాలను గెజిట్‌లో నోటిఫై చేసింది. ఇలా చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ఈ చర్యలు చేపట్టింది. ఈ చట్టాలను గతంలో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆమోదం తెలపకపోవడంతో ప్రత్యేక సమావేశంలో వాటిని తిరిగి ఆమోదించారు. ఆ తరువాత రాష్ట్రపతికి గవర్నర్‌ పంపించారు. అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులను తప్పుగా రాష్ట్రపతికి పంపడంపై సుప్రీం విచారణ జరిపి, ఈ నెల 8న కీలక తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులను గవర్నర్‌కు సమర్పించిన 2023 నవంబర్‌ 18న ఆ బిల్లులు ఆమోదం పొందినట్టుగా పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన చట్టాల్లో… చాలా చట్టాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలలో వైస్‌ ఛాన్సలర్ల నియామకాలకు సంబంధించినవి. సుప్రీంకోర్టు తీర్పుతో చట్టాలు ఆమోదం పొందడంతో సిఎం స్టాలిన్‌ హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్‌ / రాష్ట్రపతి సంతకం లేకుండా సుప్రీంకోర్టు తీర్పుతో అమలులోకి వచ్చిన మొదటి చట్టాలుగా చరిత్ర సృష్టించాయంటూ డిఎంకె రాజ్యసభ సభ్యులు పి. విల్సన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి సిఎం స్టాలిన్‌ స్పందిస్తూ… డిఎంకె అంటే చరిత్ర సృష్టించడం అని, ఇది అన్ని రాష్ట్రాల విజయం అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

➡️