కేంద్రానికి 10 ట్రేడ్ యూనియన్ల హెచ్చరిక
న్యూఢిల్లీ : నాలుగు నూతన కార్మిక కోడ్స్‌ను నోటిఫై చేస్తే సార్వత్రిక సమ్మెకు దిగుతామని కేంద్ర ప్రభుత్వాన్ని 10 ట్రేడ్ యూనియన్లు హెచ్చరించాయి. ట్రేడ్ యూనియన్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశంలో లేబర్ కోడ్ అమలు గురించి ప్రస్తావన వచ్చింది. లేబర్ కోడ్లను అమలు చేయవద్దని 10 ట్రేడ్ యూనియన్లు కేంద్ర మంత్రిని కోరాయి. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. ప్రజా, కార్మిక వ్యతిరేకమైన ఈ కార్మిక కోడ్లను ‘అహంకార పూరితమైన, దారుణమైనవి’గా విమర్శించాయి. ఈ విధానాలు ఒకవైపు ప్రజలపై మోయలేని భారాలు, నిరుదోగ్యం వంటి సమస్యలను మోపుతున్నాయని, మరొకవైపు నిరసనలు, అసమ్మతిని తెలిపే ప్రజాస్వామిక హక్కులు అరికట్టబడుతన్నాయని విమర్శించింది. అలాగే పాత పెన్షన్ స్కీమ్ (ఒపిఎస్)ను పునరుద్ధరించడానికి, 8వ పే కమిషన్ ఏర్పాటకు కేంద్రం నిరాకరిస్తుందని, దీనికి వ్యతిరేకంగా ప్రజా-కార్మిక ఐక్య పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుని వెళతామని ట్రేడ్ యూనియన్లు ప్రకటించాయి. అలాగే రైతులు, వ్యవసాయ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి.