- ఢిల్లీలో డివైఎఫ్‌ఐ భారీ ప్రదర్శన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఉద్యోగం ఇవ్వండి. లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వండి’ అని నినదిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) కార్యాలయం వద్ద డివైఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన నిరుద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం డివైఎఫ్‌ఐ ప్రతినిధి బృందం లెఫ్టినెంట్ గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి డిమాండ్ల పత్రాన్ని సమర్పించింది. ‘ఉద్యోగం ఇవ్వండి. లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వండి.
షహీద్ భగత్ సింగ్ కలలను నెరవేరుస్తాం, నిరుద్యోగాన్ని పెంచే బిజెపి ప్రభుత్వ విధానాలు నశించాలి’ అని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగిన యువకులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వైపు కదం తొక్కారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి యువకులను అడ్డుకున్నారు.
ప్రభుత్వ శాఖల్లో లక్షల పోస్టులు ఖాళీ
డివైఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు సురేష్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రిక్తా కృష్ణస్వామి, అమన్ సైనీ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం యువతకు, ఉపాధికి వ్యతిరేకమని, దీనివల్ల దేశంలో, ఢిల్లీలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ నియామకాలు జరగడం లేదని, ప్రభుత్వ శాఖలను ప్రైవేటీకరిస్తూ, బడా పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నారని అన్నారు. ఢిల్లీ గవర్నమెంట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్‌లో నమోదు చేసుకున్న 20 లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారని, నమోదు చేసుకోని వారు ఇంతకంటే ఎక్కువమంది ఉన్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మోడీ ప్రభుత్వం, ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగించిందన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు నియామక అధికారం ఉన్నప్పటికీ, నియామకాలు చేపట్టడం లేదని విమర్శించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌పై బిజెపి ఢిల్లీ రాష్ట్ర నాయకులు ఒత్తిడి తేకుండా ఉద్యోగాలు, లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న తమ డిమాండ్‌కు మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేయడానికి బదులుగా, మార్షల్, సివిల్ డిఫెన్స్‌లో ఉన్న యువకులను వారి ఉద్యోగాల నుండి తొలగించారని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షల పోస్టులను త్వరగా భర్తీ చేసి ప్రైవేటీకరణ, కాంట్రాక్టు పద్ధతికి స్వస్తి పలకాలని సూచించారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సుమిత్, ఉపాసన, విజరు మహావీర్, ప్రియాంక మాట్లాడుతూ నిరుద్యోగ యువత అందరికీ నెలకు రూ.5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, పట్టణ ఉపాధి హామీ పథకం చట్టం చేయాలని, మాదకద్రవ్యాల వ్యాపారం నిషేధించాలని, ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.