ఢిల్లీ : గిగ్ ఆర్థిక వ్యవస్థలో రెండు భిన్నమైన దృశ్యాలు మనకు కనిపిస్తాయి. తక్కువ ఆదాయ పనుల్లో ఉన్నవారు ఒక వైపు, ఉన్నత ఆదాయ పనుల్లో ఉన్నవారు మరొకవైపు ఉంటారు. దేశ రాజధాని ఢిల్లీ వంటి మహా నగరాల్లో భయంకరమైన పొగ మంచుతో కూడిన వాయు కాలుష్యానికి ఎక్కువగా గురయ్యేది ఈ దిగువ స్థాయి గిగ్ వర్కర్లే. రెక్కాడితే గాని డొక్కాడని వీరు విషపూరిత గాలి కాలుష్యంలో రేయింబవళ్లు చెమటోడ్చాల్సి వస్తోందని ఢిల్లీ యూనివర్సిటీ జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) పడిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. పేదల జీవనోపాధిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. పేలవమైన ఎక్యూఐ స్థాయి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది, శ్రామిక శక్తి ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రెట్టింపు అవుతాయి. నవంబర్ ప్రారంభంలో ఏక్యూఐ ప్రమాదకరమైన 400 మార్కును దాటడంతో, తక్కువ ఆదాయ కుటుంబాలపై వాయు కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది ఇక ఎంతమాత్రమూ విస్మరించరాని స్థితికి చేరుకుంది. ప్లాట్ఫామ్ లేదా గిగ్ ఎకానమీతో ముడిపడిన రంగాల్లో పనిచేసేవారు చుట్టూ ఉన్న విషపూరిత వాయు కాలుష్య కారకాల వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే స్థితి ఉంది. పెరుగుతున్న కాలుష్యం బలహీన వర్గాలపై మరింత అధికంగా ఉంటుంది. ఇప్పటికే భారీగా పెరిగిన ఆర్థిక, సామాజిక అసమానతలకు ఇది మరింత ఆజ్యం పోస్తుంది. గిగ్ ఎకానమీ మార్కెట్‌ను రెండు కేటగిరీలుగా వర్గీకరించవచ్చు. ఒకటి స్వల్పకాలిక ఉపాధితో కూడిన మార్కెట్. రెండవది సౌకర్యవంతమైన ఉద్యోగాలతో కూడిన మార్కెట్. ఇది తరచూ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, యాప్స్‌కు వంటి వాటి ద్వారా సులభతరం చేయబడుతుంది. గిగ్ ఎకానమీలోని కార్మికులను సాధారణంగా గిగ్ వర్కర్లు లేదా ఫ్రీలాన్సర్లు అని పిలుస్తారు, వీరు పూర్తి కాలపు ఉద్యోగులు కాదు. తాత్కాలిక లేదా స్వల్పకాలిక పనులు ఎక్కువగా చేస్తుంటారు. ఉదాహరణకు రైడ్-షేరింగ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ కొరియర్లు, ఫ్రీలాన్స్ రైటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు తదితరులు. గిగ్ ఎకానమీ కార్మికులకు స్థిరమైన ఉపాధి ఉండదు. వీరికి పర్మినెంట్ ఉద్యోగులకు ఉండే ఎలాంటి హక్కులు, రక్షణలు వీరికి లేవు. సాంకేతిక పురోగతి గిగ్ కార్మికులపై పని ఒత్తిడిని బాగా పెంచింది, ఏదేమైనా, ఈ విభాగంలో, గిగ్ రకం, నైపుణ్య స్థాయి, నిర్దిష్ట సేవలకు ఉన్న డిమాండ్‌ను బట్టి వీరి ఆదాయాలు మారుతూ ఉంటాయి. అధిక ఆదాయ గిగ్ కార్మికులు నైపుణ్యం కలిగి ఉండడమే గాక, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, గ్రాఫిక్ డిజైన్ లేదా కన్సల్టింగ్ నిపుణులుగా కూడా వుంటారు. ఈ కార్మికులు అధిక-డిమాండ్ ఉండే సేవలను అందిస్తారు. నైపుణ్యం, అనుభవం వున్నవారికి ఆ మేరకు అవకాశాలు కూడా ఎక్కువే. ఫ్రీలాన్స్ రైటింగ్, మార్కెటింగ్ లేదా వెబ్ డెవలప్మెంట్ వంటి పనులు చేసే మధ్య-ఆదాయ గిగ్ కార్మికులు రెండో వరుసలో ఉంటారు. వీరు విలువైన నైపుణ్యాన్ని కనబరచినప్పటికీ ప్రత్యేక నిపుణులతో సమానమైన రేట్లను కలిగి ఉండరు. డ్రైవర్లు, బేసిక్ డేటా ఎంట్రీ లేదా మైక్రో-టాస్క్ వర్కర్లు వంటి ఎంట్రీ-లెవల్ లేదా తక్కువ-నైపుణ్యం కలిగిన గిగ్ రోల్స్ పరిధిలోకి తక్కువ-ఆదాయ గిగ్ వర్కర్లు వస్తారు. ఈ కార్మికులు తరచూ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. స్థిరమైన ఆదాయం కోసం ఒకటికి మించి స్వల్పకాలిక ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. వేరియబుల్-ఇన్‌కమ్ గిగ్ వర్కర్లు అనే మరో కేటగిరీ ఉన్నారు. రైడ్-షేరింగ్, ఫుడ్ డెలివరీ వంటి సేవలలో వీరు ఎక్కువగా ఉంటారు. వీరి ఆదాయాలు అస్థిరంగా ఉంటాయి. చివరగా, ప్లాట్ఫామ్ యజమానులు, వీరు ఈ అన్ని కేటగిరీల గిగ్ వర్కర్ల నుండి వివిధ మోడళ్ల ఫీజులు, కమీషన్లు లేదా సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. ప్లాట్ఫామ్ విజయం, స్థాయిని బట్టి వారు అధిక ఆదాయ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పేలవమైన గాలి నాణ్యత అల్పాదాయ గిగ్ కార్మికుల పాలిట శాపంగా మారింది. ఆరోగ్య బీమా వంటి సంప్రదాయ ఉపాధి ప్రయోజనాలేవీ వీరికి అందవు. గాలి కాలుష్యాన్ని తగ్తిగంచడానికి వ్యక్తిగత వాహనాలపై ఆధారపడటాన్ని నిరుత్సాహపరచి, ప్రజా రవాణా మౌలిక సదుపాయాలలో పెట్టుబడులకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజా రవాణా ఎంపికలను పెంచడం, విస్తరింపజేయాలి. అది మొత్తం గాలి నాణ్యత మెరుగుదలకు దోహదం చేస్తుంది.
