ఫరీదాబాద్ : కారులో తిప్పుతూ.. ఓ మైనర్ బాలికపై దుండగులు రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం శనివారం హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పదో తరగతి చదువుతున్న ఓ బాలిక శనివారం ఉదయం తన సోదరుడిని స్కూల్ వద్ద వదిలి, తాను పాఠశాలకు వెళ్తున్నది. ఈ క్రమంలో స్కూల్ వద్ద ఆగి ఉన్న కారులో కూర్చున్న వ్యక్తి.. ఆమె కారు వద్దకు రాగానే.. అద్దం ఓపెన్ చేసి.. తనను కారు లోపలికి లాగేశాడు. వెంటనే కారును నడుస్తుండగానే అందులో ఉన్న మరో వ్యక్తి మైనర్ బాలికపై రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. రోజంతా ఆ బాలికను కారులో తిప్పారు. స్కూల్ ముగిసే సమయానికి గ్రామ సమీపంలో కారును ఆపి ఆ బాలికను కారులో నుంచి తోసేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. అయితే బాలిక ఇంటికి చేరగానే తల్లిదండ్రులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
