నమాజ్‌ చేస్తుండగా ఎస్‌ఐ దాడిపై నివేదిక ఇవ్వండి

Mar 17,2024 23:54 #attack, #Delhi, #Namaz, #police
  •  ఢిల్లీ పోలీసులకు కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : దేశరాజధానిలో నమాజ్‌ చేస్తుండగా ముస్లిములపై ఎస్‌ఐ దారుణంగా దాడికి పాల్పడిన ఘటనపై మే 1లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీలోని ఒక కోర్టు డిసిపిని ఆదేశించింది. ఢిల్లీలోని మక్కీ జామా మసీదు సమీపంలోని ఇంద్రలోక్‌ ప్రాంతంలో రోడ్డుపై ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం ప్రార్థనలు చేస్తున్న ముస్లిములను స్థానిక ఎస్‌ఐ మనోజ్‌ తోమర్‌ కాలితో తన్నాడు. వారిని తన్నడం, తొక్కడం, వారు ఉపయోగించే చాపలను తొక్కడానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో ఉన్నతాధికారులు ఎస్‌ఐ మనోజ్‌తోమర్‌ను సస్పెండ్‌ చేశారు. ఢిల్లీలోని తీస్‌ హజరీ కోర్టులో న్యాయవాది ఫరజ్‌ ఖాన్‌ ఈ ఘటనపై పిటీషన్‌ వేశారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడంతోపాటు సమాజంలో సామరస్యాన్ని, శాంతిని ఈ ఘటన భంగపరిచిందని పేర్కొన్నారు. నిందితులపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు విచారించింది. ఈ ఘటనపై మే 1లోగా నివేదిక ఇవ్వాలని, నిందితుడిపై తీసుకున్న చర్యలు కూడా వివరించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

➡️