జెజెఎంకి అదనపు నిధులు ఇవ్వండి

  • మోడీకి డిప్యూటీ సిఎం వినతి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జల్‌ జీవన్‌ మిషన్‌ (జెజెఎం) పథకానికి అదనపు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కోరారు. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కలుసుకుని రాష్ట్రంలో తాగు నీటి పథకాలకు తోడ్పాటు నివ్వాలని కోరారు. దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో రూపొందించిన జెజెఎం పథకం లక్ష్యాలను రాష్ట్రంలో గత ప్రభుత్వం గాలికొది లేసిందని, కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జెజెఎం ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జెజెఎం కింద కేంద్ర ప్రభుత్వం రూ.23 వేల కోట్లను కేటాయిస్తే, దానిలో కేవలం రూ.2 వేల కోట్లను మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. ఖర్చు చేసిన నిధులతో జరిపించిన పనులు కూడా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా, నాసిరకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన పథకం పనులను తగిన విధంగా ఉపయోగించుకొని, జెజెఎం ఆశయాలకు అనుగు ణంగా కొత్తగా పనుల్ని మొదలుపెట్టేందుకు సంపూర్ణ డిపిఆర్‌ను తయారు చేసిందని తెలిపారు. పథకం కింద గ్రామీణ ప్రజలందరికీ 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా, ఎలా ముందుకు వెళ్లాలనే పూర్తి ప్రణాళికతో దీన్ని రూపొందించామని పేర్కొన్నారు. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన అదనపు నిధులను కేంద్రం సానుకూల దృక్పథంతో మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సమస్య లేకుండా చూడాలనేది తమ ఆశయమన్నారు.

ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్‌ విండో విధానం మేలు

ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్‌ విండో విధానానికి మార్చాలని, దీని వలన అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ- వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ని కలిసి ఆయన ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్‌ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. ”బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్‌ విండో విధానం ఉంటే మేలు జరుగుతుంది. ఈ విధానానికి ఏపి అటవీశాఖ కస్టోడియన్‌గా వ్యవహరిస్తుంది. ఈ ప్రతిపాదననను పరిశీలించడి. ఏపి అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్‌, వేలం, ఎగుమతి సాగిస్తుంది. తద్వారా ఈ-వేలంతో రెవెన్యూ పెరుగుతుంది. ఏపి అటవీ ప్రాంతంలోనే ఎర్ర చందనం దొరుకుతుంది. కేంద్రం నిబంధనలను సవరించి ఏపికి వెలుపల పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్‌ విండో వేలంలో భాగం కస్టోడియన్‌ గా ఉండేందుకు ఏపికి అవకాశం దక్కేలా చూడాలి. దీనివల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడిన ఎర్రచందనం అమ్ముకోవడానికి కుదరదు. అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానంతో కొనసాగుతుంది” అని వివరించారు.

బిఎల్‌ సంతోష్‌తో పవన్‌ భేటీ

బిజెపి జాతీయ ఆర్గనైజేషన్‌ ప్రధాన కార్యదర్శి బిఎల్‌ సంతోష్‌తో పవన్‌ కళ్యాణ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారాహి డిక్లరేషన్‌ ప్రతిని ఆయనకు అందజేశారు. అలాగే, ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

➡️