గాంధీనగర్ : 2002 నాటి గోద్రా రైలు మారణహోమం కేసులో పరారీలో ఉన్న జీవితఖైదీ సలీమ్ జర్దా (55) పూణెలో అరెస్టయ్యాడు. దొంగతనం కేసులో జనవరి 22న మహారాష్ట్రలోని పూణెజిల్లాలో అతనిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గోద్రా మారణహోమం కేసులో సలీమ్‌జర్దాతో పాటు మరో 31 మందికి జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. 2024 సెప్టెంబర్ 17న గుజరాత్ జైలు నుండి ఏడు రోజుల పాటు పెరోల్‌పై విడుదలైన సలీమ్ జర్దా పరారయ్యాడు.
జనవరి 22న సలీమ్‌తో పాటు అతని గ్యాంగ్‌ను దొంగతనం కేసులో పూణె పోలీసులు అరెస్ట్ చేశారని, విచారణలో గోద్రా రైలు కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్థారణైందని అలెఫాటా పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ దినేష్ టేడ్ తెలిపారు. సలీమ్ మరో మూడు దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందని అన్నారు. గుజరాత్ నుండి వచ్చిన సలీమ్ పూణెలో తన గ్యాంగ్‌తో కలిసి దొంగతనాలు చేసేవాడని చెప్పారు.
2002 ఫిబ్రవరి 27న గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కి చెందిన ఎస్-6 కోచ్‌ను తగులబెట్టిన ఘటనలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 59మంది మరణించారు.