కేరళలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒటిటి వేదిక

Mar 8,2024 10:44 #cspace, #kerala, #OTT

 దేశంలోనే తొలి ప్రభుత్వ ‘ఒటిటి’గా’సి స్పేస్‌’

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇంటర్నెట్‌ ఆధారిత సేవల రంగంలోనూ కేరళ ప్రభుత్వం దూసుకుపోతోంది. ర్యాపిడి, ఓలా వంటి వాటికి ప్రత్యామ్నాయంగా ‘కె – రైడ్‌’, ముంబయిలో డబ్బా వాలాల తరహా సేవలకు ఇంటర్నెట్‌ జోడించి కుండబశ్రీ లబ్దిదారుల ద్వారా ‘లంచ్‌ బెల్‌’ వంటి వినూత్న సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన అక్కడి ప్రభుత్వం తాజాగా వినోదరంగంలోనూ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ‘నెట్‌ప్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి ఒటిటి సంస్థలకు ప్రత్యామ్నాయంగా దేశంలోనే తొలిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘సి – స్పేస్‌’ పేరిట ఒటిటి వేదికను ప్రారంభించింది. తిరువనంతపురంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యాక్రమంలో ‘సిస్పేస్‌’ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించారు. దేశంలో తొలి ప్రభుత్వ రంగ ఓటిటి ఫ్లాట్‌ఫాం ఇదేనని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు ఓటిటిల్లో ప్రసారమవుతున్న కంటెంట్‌ల్లో చాలా తేడాలున్నాయని, వాటి ప్రసారాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయని రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ షాజి ఎన్‌ కరున్‌ అన్నారు. వాటికి ప్రతిస్పందనగా సిస్పేస్‌ ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ ఓటిటి యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఒఎస్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అన్నారు. ఈ ఓటిటిలో రూ.75 ధరకే యూజర్లు కొత్త చిత్రాలు చూడొచ్చని, తక్కువ నిడివి ఉన్న కంటెంట్‌ ను సగం ధరకే వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ”పే ఫర్‌ వ్యూ” ఆధారంగా నిర్మాతలకు చెల్లింపులు చేస్తారని పేర్కొన్నారు. ఈ సిస్పేస్‌ వేదిక ద్వారా నూతన దర్శకులు తమ చిత్రాల కోసం ‘క్రౌడ్‌ ఫండింగ్‌’ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అయితే, ఒటిటి వేదికల్లో నిర్మాతలే నేరుగా చిత్రాలను విడుదల చేస్తే తమ ఆదాయాలు తగ్గుతాయని పలువురు ఎగ్జిబిటర్లు, పరిశ్రమ వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో థియేటర్లలో విడుదలైన సినిమాలను మాత్రమే సిస్పేస్‌ లో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధారణ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టీ, ఆహార, పౌర సరఫరాల మంత్రి జిఆర్‌ అనిల్‌, ఎమ్మెల్యే అంటోనీ రాజు, మేయర్‌ ఆర్య రాజేంద్రన్‌ కూడా పాల్గొన్నారు.

➡️