- సుప్రీంకు తెలిపిన ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఎఐఎడిఎంకె ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలకు నగదు కుంభకోణం కేసులో అప్పటి రాష్ట్ర మంత్రి కెటి రాజేంద్ర బాలాజీపై విచారణకు తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఇటీవల అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మంగళవారం వెల్లడించింది. అవినీతి నిరోధకం చట్టం 1988లోని సెక్షన్ 19 కింద బాలాజీని విచారణ చేయడానికి ఈ నెల 11న గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం తరుపున హాజరైన అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది అమిత్ ఆనంద్ తివారీ, న్యాయవాది సబరీష్ సుబ్రమణియన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. 2021లో నమోదైన కేసులో ఇప్పటివరకూ అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తూ వస్తున్న గవర్నర్ తా.ఆగా అనుమతి ఇవ్వడం గమనార్హం. ఇటీవలే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా ఏళ్ల తరబడి తనవద్దే నిలిపి ఉంచుకున్నందుకు గవర్నర్ రవిని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే.
పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బాలాజీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారంటూ విరుదునగర్ జిల్లాలో రెండు ఎఫ్‌ఐఆర్లు నమోదయ్యాయి. ఛార్జిషీట్లు దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఈ విషయంపై సుప్రీంకోర్టును రాష్ట్రప్రభుత్వం ఆశ్రయించింది. దీంతో మార్చి 7న జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వ ఆభ్యర్థనపై తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని గవర్నర్ ప్రిన్సిపల్ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసును సిబిఐకి బదిలీ చేస్తూ జనవరిలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అడ్వకేట్ జనరల్ అమిత్ ఆనంద్ తివారీ మంగళవారం విచారణలో వ్యతిరేకించారు. ఈ దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని, ఇప్పుడు సిబిఐకి బదిలీ చేయడం వలన కొత్తగా మళ్లీ దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంటుందని వాదనలు వినిపించారు.