మంత్రుల బృందానికి నివేదన
జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంలపై పన్ను రేటును 18 శాతం నుండి తగ్గించాలనే అంశంపై చర్చ కొలిక్కి రాకపోవడంతో దీనిని మంత్రుల బృందానికి (జిఒఎం) నివేదించారు. బహుశా నవంబరులో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సోమవారం నాడిక్కడ జరిగిన 54వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం నవంబరులో జరగనుంది. ఈలోగా మంత్రుల బృందం దీనిని పరిశీలించి ఒక నివేదిక ఇస్తుందని, దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటా మని జిఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ విలేకరులకు తెలిపారు. ఈ బీమా ప్రీమియంలపై జిఎస్‌టి తగ్గించే అంశంపై విస్తృత ఏకాభిప్రాయం ఉందన్నారు. గత పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు దీనిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాయి. కేంద్ర, రాష్ట్ర అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీ కౌన్సిల్ సమావేశం కూడా ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జిఎస్‌టిని తగ్గించాలని డిమాండ్ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా ప్రీమియంలపై జిఎస్‌టి కేంద్రం, రాష్ట్రాలు రూ.8,262.94 కోట్లు వసూలు చేయగా, ఆరోగ్య రీ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై రూ.1,484.36 కోట్ల మేర జిఎస్‌టి వసూలు చేశాయి. కేదార్‌నాథ్ యాత్రలో వినియోగించే హెలికాప్టర్ సేవలపై జిఎస్‌టి 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రైల్వే ఎయిర్ కండిషనర్లపై 28 శాతం పన్ను విధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టం ప్రకారం స్థాపించ బడిన విశ్వవిద్యాలయాల్లో పరిశోధనల కోసం ఇచ్చే నిధులను జిఎస్‌టి పరిధి నుండి మినహాయించాలని డిమాండ్ రావడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. ఎంపిక చేసిన స్నాక్స్‌పై జిఎస్‌టి 18 శాతం నుండి 12 శాతానికి తగ్గించారు. కేన్సర్ ఔషధాలపై జిఎస్‌టి రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. నాప్‌కిన్స్‌్‌పై 18 శాతం నుండి 12 శాతానికి తగ్గించారు. కార్ సీట్లపై జిఎస్‌టి రేట్లను 18 శాతం నుంచి 28 శాతానికి పెంచినట్లు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజరు మల్హోత్రా తెలిపారు.కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రులు జిఎస్‌టి పరిహారం సెస్‌ను సమీక్షించాలని పట్టుబట్టారు. ‘ఆరోగ్య బీమాపై జిఎస్‌టిని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య వ్యతిరేకించారు.
రీసెర్చ్ గ్రాంట్లు పొందే విద్యా సంస్థలను జిఎస్‌టి పరిధిలోకి తేకూడదని ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు కోరుతున్నాయని ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి చెప్పారు. ఉక్కుపై జిఎస్‌టి 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా డిమాండ్ చేశారు.