గాంధీనగర్ : ఆదివారం తెల్లవారుజామున గుజరాత్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. డాంగ్ జిల్లా లోని సపుతర హిల్ స్టేషన్ పరిధిలో యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 5.30 గంటలకు బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతు లోయలోకి దూసుకెళ్లింది. .బ్రేకులు ఫెయిల్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరగగానే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. యాత్రికులు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్‌లోని ద్వారకకు వస్తుండంగా ఈ ప్రమాదం సంభవించింది. బాధితులంతా మధ్యప్రదేశ్‌లోని గుణ, శివపురి, అశోక్ నగర్ జిల్లాలకు చెందినవారని డాంగ్ జిల్లా కలెక్టర్ మహేశ్ పటేల్ తెలిపారు. ఈ జిల్లాలకు చెందిన కొంత మంది దేశంలోని వివిధ రాష్ట్రాల్లోగల పుణ్యక్షేత్రాలను దర్శించుకు నేందుకు 4 వేర్వేరు బస్సుల్లో బయలుదేరారని, వాటిలో ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిందని చెప్పారు.
