నీట్‌ స్కామ్‌ అనడానికి గుజరాత్‌ ఎఫ్‌ఐఆర్‌ నిదర్శనం : స్టాలిన్‌

చెన్నై : ప్రతిభకు కొలమానంగా ఉండాల్సిప నీట్‌ పరీక్ష సమాజంలో ప్రజలందరిపై ప్రభావం చూపే స్కామ్‌కు వేదికని పదేపదే రుజువైందని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షులు ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. నీట్‌ అక్రమాల్లో అనేకమంది ఉపాధ్యాయులు, కోచింగ్‌ సెంటర్ల ప్రమేయం ఉందని గుజరాత్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఈ పరీక్షలో జరగాల్సిన ‘తక్షణావసరమైన వ్యవస్థాగత మార్పుల’ను ప్రస్తావిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘విద్యార్థులకు, సామాజిక న్యాయానికి, పేదలకు వ్యతిరేకమైన నీట్‌ వ్యవస్థను రక్షించడాన్ని కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ఆపాలి’ అని డిమాండ్‌ చేశారు. నీట్‌ చుట్టూ కొనసాగుతున్న వివాదాలు ప్రాథమికంగా ఉన్న అసమాన స్వభావాన్ని ఎత్తిచూపుతున్నాయని తెలిపారు. ‘వేల సంవత్సరాలుగా విద్య నిరాకరించబడిన అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం మనం మరిన్ని అవకాశాలను అందించాలి. దీనికి విరుద్ధంగా అటువంటి విద్యార్థుల అవకాశాలను నీట్‌ అడ్డుకుంటుంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ)ను కేంద్ర విద్యా మంత్రి సమర్థించినప్పటికీ అందుకు భిన్నమైన సంఘటనలు జరుగుతున్నాయి’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

➡️