గాంధీనగర్ : ర్యాగింగ్ పేరుతో సీనియర్ల వేధింపులకు ఓ వైద్య విద్యార్థి మృతిచెందిన ఘటన గుజరాత్‌లో జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పటాన్ జిల్లాలోని ధార్‌పూర్‌లోని జిఎంఇఆర్‌ఎస్ మెడికల్ కాలేజీ మరియు ఆస్పత్రికి చెందిన హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. సహ విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగా హాస్టల్‌కు వచ్చిన అనిల్ మెథానియా (18) తనని తాను పరిచయం చేసుకున్నాడు. అనంతరం ర్యాగింగ్ పేరుతో మూడు గంటల పాటు కదలకుండా నిలబడాల్సిందిగా సీనియర్లు అతనిని ఆదేశించారు. కొంతసేపు తర్వాత అనిల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా మరణించినట్లు వైద్యులు తెలిపారు.
యాంటీ ర్యాగింగ్ బృందం ఈ ఘటనపై విచారణ చేపట్టిందని, సీనియర్లు వేధించినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి డీన్ డా.హార్థిక్ షా తెలిపారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపామని అన్నారు. అయితే ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసినట్లు బలిసానా పోలీస్‌స్టేషన్‌కి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
జూనియర్ విద్యార్థులను సుమారు మూడు గంటల పాటు నిల్చుని ఒక్కొక్కరిగా తమను తాము పరిచయం చేసుకోవాలని ఎనిమిది మంది సీనియర్ విద్యార్థుల బృందం వేధింపులకు గురిచేసినట్లు ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న మరో విద్యార్థి తెలిపారు.
అనిల్ స్పృహతప్పి పడిపోయినట్లు తన మామయ్య నుండి ఫోన్ వచ్చిందని, ఆస్పత్రికి చేరుకునేసరికి చనిపోయినట్లు వైద్యులు తెలిపారని అనిల్ సోదరుడు ధర్మేంద్ర మెథానియా పేర్కొన్నారు. ర్యాగింగ్ పేరుతో సీనియర్ల వేధింపులతో తన సోదరుడు మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.