ఎస్‌ఐని చంపేసిన గుజరాత్‌ లిక్కర్‌ మాఫియా

Nov 5,2024 23:37 #Gujarat Liquor Mafia, #killed SI

గాంధీనగర్‌ : గుజరాత్‌లో లిక్కర్‌ మాఫియా రెచ్చిపోయింది. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఎస్‌యువిని ఆపేందుకు యత్నించిన ఒక ఎస్‌ఐని దారుణంగాహత్య చేసింది. ఈ ఘటన సురేంద్రనగర్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో సంభవించింది. పోలీసు అధికారులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం అక్రమంగా మద్యం సరఫరా అవుతుందనే పక్కా సమాచారంతో దాసడ-పట్టి రహదారిపై కథాడ గ్రామ సమీపంలో రాష్ట్ర మానిటరింగ్‌ సెల్‌ (ఎస్‌ఎంసి) సభ్యులు, ఎస్‌ఐ జెఎం పఠాన్‌ తన బృందంతో కాపు కాసారు. మద్యం రవాణా చేస్తున్న ఎస్‌యువిని అడ్డుకునేందుకు బారికేడ్లతో రోడ్‌బ్లాక్‌ కూడా చేశారు. ఎస్‌యువి, తన ట్రైలర్‌తో పాటు వీటిని ఢకొీట్టుకుని ముందుకు దూసుకొచ్చింది. దీంతో ఎస్‌యువిని అడ్డుకునే ప్రయత్నం చేశారు పఠాన్‌. దాని హెడ్‌లైట్ల కాంతికి పఠాన్‌ కళ్లుమూసుకున్నాయి. దీని వలన పఠాన్‌ తన వాహనంపై నియంత్రణ కోల్పోయి ట్రాలర్‌ వెనుక భాగాన్ని ఢకొీట్టారు. ఈ ప్రమాదంలో పఠాన్‌ తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆయన్ను సమీపంలో ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. అప్పటికే పఠాన్‌ మరణించినట్లు వైద్యులు చెప్పారు.
ఎస్‌ఐ జెఎం పఠాన్‌ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్‌ సంఘవి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘ఎస్‌ఎంసి అధికారి పఠాన్‌ అక్రమ మద్యం రవాణా వాహనాన్ని ఆపే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌ పోలీసులు ఒక ధైర్యవంతుడు, కష్టపడి పనిచేసే అధికారిని కోల్పోయారు. మద్య నిషేధ వ్యతిరేక పోరాటంలో ప్రాణత్యాగం చేసిన ఈ వీరుడికి హృదయపూర్వక నివాళి. పఠాన్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు. గుజరాత్‌ ప్రొహిబిషన్‌ యాక్ట్‌ ప్రకారం ఆ రాష్ట్రంలో మద్యం తయారీ, విక్రయం, రవాణాను నిషేధించారు. దీనిని పర్యవేక్షించడానికి ఎస్‌ఎంసి అనే ప్రత్యేక విభాగాన్ని గుజరాత్‌ పోలీస్‌ ఏర్పాటు చేసింది.

➡️