శ్రీనగర్ : పవిత్ర రంజాన్ మాసంలో మార్చి 7వ తేదీన కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ప్రముఖ స్కై రిసార్టులో.. ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో జరిగింది. పర్యాటక రంగం ప్రచారానికి సంబంధించి ఈ ఫ్యాషన్ షోలో మహిళలు, పురుషులు పొట్టిపొట్టి దుస్తులు ధరించి ర్యాంప్‌వాక్ చేశారు. రెచ్చగొట్టే విధంగా ఉన్న వారి వస్త్రధారణ పట్ల ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వంపై పలువురు మండిపడుతున్నారు. తాజాగా ఈ ఫ్యాషన్ షో పై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పిడిపి పార్టీ నేత మెహబూబా ముఫ్తీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యాషన్ షోకు సంబంధించిన ఫొటోలు అసభ్యంగా ఉన్నాయని, ఆ ఫొటోలు చూసి తానెంతో బాధపడ్డానని ముఫ్తీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, ‘రంజాన్ మాసంలో అసభ్యకరమైన ఈ ఫ్యాషన్ జరగడం దిగ్భ్రాంతికరం. మన సాంస్కృతిక విలువలకు విరుద్ధమైన ఈ కార్యక్రమాల ద్వారా ప్రైవేటు హోటళ్లు, యజమానులు ఇటువంటి అసభ్యతను ప్రోత్సహించడానికి అనుమతించడం శోచనీయం’ అని ముఫ్తీ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలని అన్నారు. జవాబుదారీతనం విస్మరించడం వల్ల జరిగే ఇలాంటి ఘటనలతో మన సంస్కృతికి, సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆమె అన్నారు.
ఈ ఫ్యాషన్ షో వ్యవహారంపై జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ కూడా దద్దరిల్లింది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
